Today Business Headlines 15-03-23:
లక్షకుపైగా కంపెనీలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లక్షకు పైగానే కంపెనీలు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లక్షా 13 వేల సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి తెలంగాణలో 86 వేల 704 కంపెనీలు, ఏపీలో 26 వేల 437 సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో 42 వేల 646 కంపెనీలు ఉండగా మూసివేసినవాటిని మరియు రద్దయ్యే క్రమంలో ఉన్న వాటిని తీసేస్తే నికరంగా 26 వేల 437 మాత్రమే తేలాయి.
రైతులకు అగ్రి లోన్లు
గ్రామాల్లో రైతులకు రుణాలు ఇచ్చేందుకు యాక్సిస్ బ్యాంక్.. ఐటీసీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో.. ఐటీసీ సంస్థలోని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ కోసం ప్రత్యేకంగా పంటలు పండించే కర్షకులకు ఈజీగా లోన్లు ఇవ్వనున్నారు. వ్యవసాయ రుణాలు, బంగారంపై రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు అగ్రి-టెక్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ విషయాలను యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మనీశ్ సర్దా వెల్లడించారు.
మరో 10 వేల మంది
మెటా సంస్థ 4 నెలల వ్యవధిలో మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. నవంబర్‌లో 11 వేల మందిని తీసేసిన ఈ కంపెనీ రానున్న 2 నెలల్లో 10 వేల మందికి లేఆఫ్ ఇవ్వనుంది. ఇంకో 5 వేల వేకెన్సీలను భర్తీ చేయకూడదని కూడా నిర్ణయం తీసుకుంది. వ్యాపార పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని, అందుకే కంపెనీ ఆర్థిక స్థితిగతులను రక్షించుకోవటానికి ఖర్చులను తగ్గించుకుంటున్నామని చెబుతోంది. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టా సంస్థలకు మెటా.. పేరెంట్ కంపెనీ అనే సంగతి తెలిసిందే.
సీసీఐ గ్రీన్‌సిగ్నల్
రిలయెన్స్ రిటైల్ సంస్థలో మెట్రో క్యాష్ అండ్ క్యారీ కంపెనీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. CCI.. ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థలు విలీనమవుతున్నాయనే ప్రకటన డిసెంబర్‌లో వెలువడింది. ఈ డీల్ విలువ 2 వేల 850 కోట్ల రూపాయలు. జర్మనీకి చెందిన మెట్రో క్యాష్ అండ్ క్యారీకి మన దేశంలో 30 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. ఇందులో 10 లక్షల మంది తరచుగా కొనుగోళ్లు చేసేవారే కావటం చెప్పుకోదగ్గ విషయం. మెట్రోకి 21 సిటీల్లో 31 స్టోర్లు ఉన్నాయి.
వివాదంలో.. జోహో
జోహో కంపెనీ కోఫౌండర్ అండ్ CEO శ్రీధర్ వెంబు కుటుంబ గొడవలు రచ్చకెక్కాయి. శ్రీధర్ తనను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ ఆరోపించారు. తనను, తన కుమారుణ్ని రెండేళ్ల కిందట వదలిపెట్టారని తెలిపారు. సంస్థలోని ఉమ్మడి షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేశారని తప్పుపట్టారు. ఈ మేరకు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో జనవరిలోనే వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వివాదానికి అసలు కారణం తన మామేనని శ్రీధర్ అన్నారు.
వినియోగదారుల దినం
ఇవాళ మార్చి 15వ తేదీ. ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది తొలిసారిగా 1983లో ప్రారంభమైంది. కస్టమర్లకు ఎలాంటి హక్కులు, అవసరాలు ఉంటాయి?. వాటిని ఎలా సాధించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి? సంస్థల చేతిలో మోసపోయినప్పుడు న్యాయం పొందే విధానమేంటి? అనే అంశాలపై అవగాహన కల్పించటం కోసమే ఈ రోజును కేటాయించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీని దీనికి ఇన్‌స్పిరేషన్‌గా చెప్పుకోవచ్చు.