Today (26-12-22) Stock Market Roundup: గతవారం మొత్తం వెంటాడిన కొవిడ్ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు కోలుకుంది. ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం లాభాలతో మొదలై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై ఏమాత్రం పడకపోవటం గమనించాల్సి విషయం.
రెండు సూచీలు కూడా బెంచ్ మార్క్‌కు పైనే ట్రేడ్ అవటం ఈ రోజు చెప్పుకోదగ్గ అంశం. సెన్సెక్స్ 721 పాయింట్లు పెరిగి మళ్లీ 60 వేల మైలురాయిని దాటింది. చివరికి 60 వేల 566 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 196 పాయింట్లు లాభపడి మరోసారి 18 వేల మైల్‌స్టోన్‌ని బ్రేక్ చేసింది. మొత్తానికి 18 వేల 3 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సువెన్ ఫార్మా, ట్రెంట్ సంస్థల షేర్ల వ్యాల్యూ బాగా పడిపోయింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండున్నర శాతం వరకు ర్యాలీ తీశాయి.
read also: India in World Steel Production: ఉక్కు ఉత్పత్తిలో.. ప్రపంచంలో..
నిఫ్టీలో ఫార్మా కంపెనీల స్టాక్స్ తప్ప మిగతా అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. మెటల్ మరియు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సూచీలు ఒక శాతం వరకు ప్రాఫిట్స్ పొందాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. ఎన్‌డీటీవీ షేర్లు 5 శాతానికి పైగానే లాభాలను ఆర్జించటం హైలైట్‌గా నిలిచింది. ఫౌండర్లు ప్రణయ్ రాయ్ మరియు రాధికా రాయ్‌లు ఈ కంపెనీలో 27 శాతానికి పైగా ఉన్న తమ షేర్లను అదానీ గ్రూపుకి విక్రయించాలని నిర్ణయించటం ఎన్‌డీటీవీకి కలిసొచ్చింది.
గత నాలుగు రోజుల్లో 15 శాతం తగ్గిన పూనావాలా ఫిన్‌కార్ప్ షేర్ల ధరలు ఇవాళ 13 శాతం పెరగటం విశేషం. 10 గ్రాముల బంగారం ధర నామమాత్రంగా 66 రూపాయలు మాత్రమే పెరిగి 54 వేల 640 రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు కూడా అత్యంత స్వల్పంగా 22 రూపాయలు ప్లస్సయి 69 వేల 55 రూపాయలు పలికింది. రూపాయి విలువ మూడు పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 83 పైసలుగా నమోదైంది.
