Today (25-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రిపబ్లిక్ డే ముందస్తు జోష్ ఏమాత్రం కనిపించలేదు. నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు.. మార్కెట్ సెంటిమెంట్‌ను కుదిపేయడంతో ఫ్రంట్‌లైన్ సూచీలు ఇవాళ బుధవారం విపరీతంగా క్షీణించాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 850 పాయింట్లకు పైగా తగ్గిపోయింది. నిఫ్టీ.. బెంచ్ మార్క్ కన్నా దిగువకు పడిపోయింది.
read more: Apple Company: iPhone లేటెస్ట్ మోడల్స్‌కి కేరాఫ్‌గా మారనున్న ఇండియా
అయినప్పటికీ మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యూనీ లీవర్, హిండాల్కో, బజాజ్ ఆటో, టాటా స్టీల్ షేర్లు బాగా రాణించాయి. మరో వైపు.. అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్ స్టాక్స్ భారీగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ 773 పాయింట్లు కోల్పోయి 60 వేల 205 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 226 పాయింట్లు నష్టపోయి 17 వేల 891 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 8 కంపెనీలు లాభాల బాటలో నడిచాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక శాతం డౌన్ అయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. బీఎస్‌ఈ బ్యాంకెక్స్ రెండు శాతానికి పైగా నేల చూపులు చూసింది. పవర్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ తదితర సూచీలు సైతం వెనకబడ్డాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. జొమాటో షేర్ ఘోరంగా.. 15 శాతం.. మునిగిపోయింది. ఫలితంగా 6 నెలల కనిష్టానికి.. అంటే.. 44 రూపాయల 35 పైసలకు పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర 128 రూపాయలు తగ్గి గరిష్టంగా 56 వేల 841 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు స్వల్పంగా 181 రూపాయలు పడిపోయి అత్యధికంగా 68 వేల 300 రూపాయలుగా నమోదైంది. క్రూడాయిల్ ధరలో చెప్పుకోదగ్గ మార్పు లేదు. అత్యంత స్వల్పంగా 3 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 559 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 6 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 60 పైసల వద్ద స్థిరపడింది.