Today (24-12-22) Business Headlines:
శ్రీరాం ఆల్ ఇన్ ఒన్ ఆర్థిక సేవలు: శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్ విలీనమై శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు వివిధ లోన్ల కోసం వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని బ్రాంచిల్లో అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ అండ్ సీఈఓ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 498 శాఖలు ఉండగా 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వచ్చే రెండేళ్లలో 2 వేల మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు.
చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ అండ్ ఎండీ చందా కొచ్చర్ మరియు ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను.. సీబీఐ అరెస్ట్ చేసింది. వీడియోకాన్ సంస్థకు పదేళ్ల కిందట ఇచ్చిన లోన్ ఇష్యూకి సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తునకు సహకరించనందువల్ల అదుపులోకి తీసుకోవాల్సి వచ్చినట్లు వివరణ ఇచ్చింది. నిన్న శుక్రవారం ఢిల్లీలోని సీబీఐ సెంట్రల్ ఆఫీసుకి విచారణ నిమిత్తం వీళ్లిద్దరిని పిలిచిన అధికారులు కొద్దిసేపు ఇంటరాగేట్ చేశాక అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితులను ఇవాళ సీబీఐ కోర్టులో ప్రవేశపెడతారు.
4 రోజుల్లో.. 16 లక్షల కోట్ల నష్టం
ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. కేవలం 4 రోజుల్లో ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయల సంపద మటాష్ అయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 272 పాయింట్ ఒకటీ రెండు లక్షల కోట్లకు తగ్గిపోయింది. బ్యారెల్ క్రూడాయిల్ ఒకటీ పాయింట్ ఎనిమిదీ తొమ్మిది శాతం పెరిగి 82 పాయింట్ ఐదు ఒకటి దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆసియాలోని అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఐరోపా ఇండెక్సులు మాత్రం లాభాలను ఆర్జించాయి.
మరోసారి తగ్గిన ఫారెక్స్ రిజర్వ్స్
ఇండియా విదేశీ మారక నిల్వలు వరుసగా ఐదు వారాల పాటు పెరిగి మరోసారి తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 16వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్స్ సుమారు 4 వేల 700 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. దీంతో మొత్తం నిల్వలు దాదాపుగా 46 లక్షల 29 వేల కోట్ల రూపాయలకు పడిపోయాయి. ఫారన్ కరెన్సీ అసెట్స్ 500 మిలియన్ డాలర్లు మైనస్ అయ్యాయి. ఫలితంగా 499 పాయింట్ ఆరు రెండు నాలుగు బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి.
200 స్టార్టప్స్ అప్లై.. 17 ఎంపిక..
సరికొత్త ఆవిష్కరణలతో ‘హెల్త్ కేర్ సెక్టార్’లో తమదైన సేవలు అందించిన 17 ‘స్టార్టప్’లను ప్రభుత్వం గుర్తించింది. టీహబ్ మరియు అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలోని ఆరోగ్య సంక్షణ కార్యక్రమం కోసం ఎంపిక చేసింది. ఈ ప్రోగ్రామ్ థర్డ్ ఫేజ్ నిమిత్తం వీటిని సెలెక్ట్ చేశారు. ఈ మేరకు మొత్తం 200 స్టార్టప్స్ అప్లై చేయగా కేవలం 17 స్టార్టప్స్ మాత్రమే ఎంపిక కావటం విశేషం. ఈ మేరకు టీహబ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
సువెన్’లో వాటా.. ‘అడ్వెంట్’కి?
హైదరాబాదులోని ప్రముఖ ఫార్మా సంస్థ ‘సువెన్’లో మెజారిటీ షేరును అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీకి విక్రయించనున్నారు. ప్రమోటర్లకు సంబంధించిన 51 శాతం వాటాను 6 వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసే విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బ్లాక్ స్టోన్ అనే సంస్థ కూడా పోటీ పడినప్పటికీ చివరికి అడ్వెంట్ ఒక్కటి మాత్రమే నిలిచినట్లు సమాచారం అందుతోంది. సువెన్ ఫార్మా మార్కెట్ విలువ 12 వేల 300 కోట్ల రూపాయలుగా నమోదైంది.