Today (14-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ మొత్తం పాజిటివ్ ట్రేడింగ్ నడిచింది. ఈ రోజు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడి నేటి అత్యధిక విలువ అయిన 61 వేల 102 పాయింట్లను నమోదు చేసింది.
నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పెరిగి ఒకానొక దశలో 17 వేల 900 పాయింట్లను దాటిపోయింది. ఐటీ స్టాక్స్ ర్యాలీ తీయటంతో లాభాలు కొనసాగాయి. జనవరి నెలకు సంబంధించిన టోకు ధరల ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్టానికి.. అంటే.. 4 పాయింట్ ఏడు మూడు శాతానికి పడిపోవటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కి మద్దతుగా నిలిచింది. చివరికి.. సెన్సెక్స్.. 600 పాయింట్లు పెరిగి 61 వేల 32 పాయింట్ల వద్ద ముగిసింది.
read more: Loss For Life Insurers: అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్నుల ప్రభావం
నిఫ్టీ.. 158 పాయింట్లు లాభపడి 17 వేల 929 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 19 కంపెనీలు లాభాల బాటలో నడవగా 11 సంస్థలు నష్టాల బారిన పడ్డాయి. బీఎస్‌ఈలో ఆయిల్ ఇండియా, సైయెంట్, యూపీఎల్ మంచి పనితీరు కనబరిచాయి. ఫోనిక్స్ మిల్స్, నోసిల్, హెచ్‌డీఎఫ్‌సీ ఘోరంగా పడిపోయాయి.
రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ బాగా రాణించింది. ఒక శాతం వరకు లాభపడింది. మరో వైపు.. రియాల్టీ ఇండెక్స్ ఘోరంగా దెబ్బతిన్నది. ఒక శాతం వరకు నష్టపోయింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ విలువ ఒక్కసారిగా 10 శాతం పెరిగింది.
తద్వారా ఇవాళ 18 వందల 89 రూపాయల అత్యధిక విలువకు చేరుకుంది. 3వ త్రైమాసికం ఫలితాలు ఈ సంస్థకు కలిసొచ్చాయి. నైకా పేరెంట్ సంస్థ అయిన FSN e-Commerce Ventures షేర్లు 3 శాతానికి పైగా డౌన్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 333 రూపాయలు పెరిగి అత్యధికంగా 56 వేల 830 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు స్వల్పంగా 58 రూపాయలు ప్లస్సయి గరిష్టంగా 66 వేల 202 రూపాయలుగా నమోదైంది. క్రూడాయిల్ ధర 88 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 558 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 78 పైసల వద్ద స్థిరపడింది.