Today (04-01-23) Business Headlines:
హైదరాబాద్ టు కాకినాడ
హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్.. ఏపీలోని కాకినాడలో ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటుచేయనుంది. ఔషధాల తయారీకి కావాల్సిన ‘కీ స్టార్టింగ్ మెటీరియల్స్’, ఇంటర్మీడియెట్స్, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రెడియంట్స్ మరియు ఫెర్మెంటేషన్ ప్రొడక్టుల కోసమే ఈ కొత్త ప్లాంట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వచ్చే ఐదు సంవత్సరాల్లో 2 వేల కోట్ల రూపాయలను దశల వారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొంది. ఈ పరిశ్రమను సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనున్నారు.
హైదరాబాదులో ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్’
మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల దాదాపు మూడేళ్ల అనంతరం ఇండియాకి వచ్చారు. నిన్న మంగళవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో హైదరాబాద్ కూడా రానున్నారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసైన అజూర్‌కి నాలుగో రీజియన్‌ని భాగ్యనగరంలో యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటైజేషన్ ప్రక్రియ ఇండియాలో చాలా బాగా జరుగుతోందని మెచ్చుకున్నారు. మరో మూడేళ్లలో అన్ని అప్లికేషన్లూ క్లౌడ్ బేస్డ్‌గానే రూపొందుతాయని సత్య నాదెళ్ల తెలిపారు.
రు.1.6 లక్షల కోట్లకు రెవెన్యూ
2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో మీడియా మరియు ఎంటర్టైన్‌మెంట్ సెక్టార్ ఆదాయం ఒకటీ పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఈ రంగంలో 12 శాతం నుంచి 14 శాతం వరకు గ్రోత్ రేట్ నెలకొంటుందని అంచనా వేసింది. ఆదాయంలో 55 శాతం వాణిజ్య ప్రకటనల రూపంలో వస్తుందని, మిగతా 45 శాతం సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా వస్తుందని తెలిపింది. అడ్వర్టైజ్‌మెంట్‌ల రూపంలో వచ్చే రెవెన్యూలో ఫస్ట్ ప్లేస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లదేనని, ఆ తర్వాత స్థానాల్లో టీవీ మరియు ప్రింట్ మీడియాలు ఉన్నాయని క్రిసిల్ వివరించింది.
‘ఆల్-టైమ్ లో లెవల్’కి రూపాయి
డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ నిన్న మంగళవారం ఆల్‌టైమ్ లో లెవల్‌కి పడిపోయింది. 22 పైసలు పతనమై 83 రూపాయల వద్ద ముగిసింది. డాలర్ బలపడిన కారణంగా ఫారన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా మార్కెట్ నుంచి వెళ్లిపోయాయి. ఫలితంగా రూపాయిపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రారంభ లాభాలను కోల్పోయింది. మార్నింగ్ సెషన్‌లో 82 పాయింట్ ఆరు తొమ్మిది రూపాయల వద్ద ప్రారంభమైన మారకం విలువ ఇంట్రాడేలో నేలచూపులు చూసింది. 2021 అక్టోబర్ 19 తర్వాత ఇంత తక్కువ విలువ నమోదవటం ఇదే తొలిసారి.
25 నుంచి ఆకాశ ఎయిర్ సర్వీసులు
దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా వచ్చిన ఆకాశ ఎయిర్‌లైన్స్ సేవలు హైదరాబాద్ నుంచి ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి గోవా మరియు బెంగళూరులకు ఇంకో రెండు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. దీంతో రోజువారీ సేవలకు శ్రీకారం చుట్టనుంది. బిజినెస్ మరియు టూరిజం ప్యాసింజర్లను దృష్టిలో ఉంచుకొని ఈ సర్వీసులను ఆరంభిస్తోంది. ఈ విషయాలను ఆకాశ ఎయిర్ కోఫౌండర్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు.
సినిమాహాల్ ఓనర్ల ఇష్టం
ప్రేక్షకులు బయటి నుంచి ఫుడ్ మరియు బేవరేజెస్ తెచ్చుకోకుండా నిషేధించే అధికారం సినిమా హాళ్లకు, మల్టీప్లెక్స్‌లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమా థియేటర్లనేవి వాటి యజమానుల ప్రైవేట్ ప్రాపర్టీ అని, అందువల్ల ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావొద్దు అని నిర్ణయించే అధికారం వాళ్లకు ఉంటుందని పేర్కొంది. మల్టీప్లెక్స్ మరియు సినిమా హాళ్లలోకి విజిటర్లు బయటి నుంచి ఫుడ్ అండ్ బేవరేజెస్ తెచ్చుకోకుండా నిషేధించొద్దంటూ జమ్మూకాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
