NTV Telugu Site icon

Today (02-02-23) Business Headlines: విమానాశ్రయంలో వినోదం. మరిన్ని వార్తలు

Today (02 02 23) Business Headlines

Today (02 02 23) Business Headlines

Today (02-02-23) Business Headlines:

అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’

మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్‌ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్‌ 7 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది. వార్షిక రాబడిని 116 పాయింట్‌ ఆరు ఒకటి బిలియన్‌ డాలర్లుగా పేర్కొంది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 86 వేల 482 అని, అంతకు ముందు సంవత్సరం కన్నా ఇది 20 శాతం ఎక్కువని మెటా వివరించింది.

FPOపై అదానీ అనూహ్య నిర్ణయం

ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌.. FPO.. విషయంలో ముందుకు వెళ్లకూడదని అదానీ సంస్థ భావించింది. పెట్టుబడిదారులకు వాళ్ల డబ్బులను తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో అదానీ ఎఫ్‌పీఓ సక్సెస్‌ అవుతుందా లేదా అని అందరూ అనుమానించారు. కానీ.. ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆ ఆఫర్‌ విజయవంతంగా ముగిసింది. కానీ.. అదానీ తన పలుకుబడితో ఏదో విధంగా గట్టెక్కారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లటం నైతికంగా సరికాదని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు.

ఈ దశాబ్దం మనదే: భవిష్‌ అగర్వాల్‌

ఈ దశాబ్దం భారతదేశానిదేనని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఓలా CEO భవిష్ అగర్వాల్ అన్నారు. ఇండియా అమృతకాలంలోకి ప్రవేశిస్తోందనటానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన బడ్జెట్ ప్రసంగమే నిదర్శనమని చెప్పారు. ప్రపంచంలో మనకంటూ ఒక సమయం వచ్చిందని, మన భవిష్యత్తును అద్భుతంగా నిర్మించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యంగ్‌ ఇండియా, ఎంట్రప్రెన్యూరల్‌ ఇండియా.. దేశాన్ని ముందుండి నడిపిస్తాయని, రేపటి టెక్నాలజీలను ఈ రోజు రూపొందిస్తాయని భవిష్‌ అగర్వాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

తొలి ఎయిర్‌పోర్ట్ మల్టీప్లెక్స్‌ లాంఛ్

దేశంలోనే తొలిసారిగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌ కాంప్లెక్స్‌లో మల్టీప్లెక్స్‌ను PVR సినిమాస్‌ సంస్థ లాంఛ్‌ చేసింది. తద్వారా తమిళనాడులోని మొత్తం స్క్రీన్‌ల సంఖ్యను 88కి, చెన్నైలో స్క్రీన్‌ల సంఖ్యను 77కి పెంచుకుంది. నిన్న బుధవారం కొత్తగా ప్రారంభించిన ఈ PVR ఏరోహబ్‌లో ఒక్కసారే 5 స్క్రీన్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 11 వందల 55 మంది ప్రేక్షకులు వీక్షించొచ్చు. విమానాశ్రయానికి వచ్చిపోయే ప్రయాణికులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని ఇవి పంచుతాయని సంస్థ పేర్కొంది.

ఆసియా కుబేరుడిగా మళ్లీ అంబానీ

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో గౌతమ్‌ అదానీ సంపద విలువ రోజురోజుకీ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఆసియాలో అత్యంత కుబేరుడిగా మళ్లీ ముఖేష్‌ అంబానీ నిలిచారు. గౌతమ్‌ అదానీ సంస్థల షేర్ల విలువ 28 శాతం పడిపోవటంతో ఆయన మొత్తం సంపద 72 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చింది. అదే సమయంలో 81 బిలియన్‌ డాలర్ల సంపదతో ముఖేష్‌ అంబానీ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. అదానీ సంపద వారం రోజుల్లోనే 44 బిలియన్‌ డాలర్లు పతనమైందని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

శామ్‌సంగ్ ఫోన్‌.. 200 ఎంపీ కెమెరా

శామ్‌సంగ్‌ సంస్థ గెలాక్సీ సిరీస్‌లో ఎస్‌23, ఎస్‌23 ప్లస్‌ మరియు ఎస్‌23 అల్ట్రా మోడళ్లను ఆవిష్కరించింది. ఎస్‌23 అల్ట్రా మోడల్‌ మొబైల్‌ ఫోన్‌లో 200 మెగా పిక్సెల్‌ సామర్థ్యం కలిగిన కెమెరాను అమర్చారు. శామ్‌సంగ్‌ కంపెనీ 200 మెగా పిక్సెల్‌ కెపాసిటీ గల కెమెరాను అందుబాటులోకి తేవటం ఇదే మొదటిసారి. ఈ డివైజ్‌ను క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెనరేషన్‌ 2 చిప్‌సెట్‌తో రూపొందించారు. ఇందులో 5 వేల మిల్లీయాంపియర్‌ అవర్‌ సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తోంది.