Today (02-01-23) Business Headlines:
హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ చేసుకుంది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల బిర్యానీలను మరియు రెండున్నర లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను డెలివరీ చేసింది. 75 శాతం మందికి పైగా కస్టమర్లు హైదరాబాద్ బిర్యానీనే కోరుకున్నారని ట్విట్టర్‌లో నిర్వహించిన సర్వేలో తేలినట్లు స్విగ్గీ వెల్లడించింది. హైదరాబాద్‌లోని బావర్చి.. నిమిషానికి రెండు చొప్పున బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసింది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఈ రెస్టారెంట్ ఏకంగా 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్లు తెలిసింది. మొత్తం 13 లక్షల ఆర్డర్లలో12 వేల 344 కిచిడీకి, 2 వేల 757 ప్యాకెట్ల డ్యూరెక్స్ కండోమ్‌లకు సంబంధించినవని స్విగ్గీ పేర్కొంది.
రూ.లక్ష కోట్ల సెల్‌ఫోన్ల ఎక్స్‌పోర్ట్ లక్ష్యం
2023లో మన దేశం నుంచి లక్ష కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ఇండియా ఇప్పుడు 45 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను ఎక్స్‌పోర్ట్ చేస్తుండగా ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనేది ప్రధాని మోడీ టార్గెట్ అని చెప్పారు. టాప్-10 భారత్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లు కూడా ఉండాలని సర్కారు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీని ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి చంద్రశేఖర్ వివరించారు.
టాటా సన్స్ మాజీ ఎండీ కేకే మృతి
టాటా సన్స్ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే కృష్ణ కుమార్ నిన్న ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. కేకేగా పాపులర్ అయిన ఈయన 1991 మే నెల నుంచి 1998 జనవరి వరకు టాటా గ్లోబల్ బేవరేజెస్‌కి ఎండీగా వ్యవహరించారు. టాటా గ్రూప్ అధిపతి రతన్ టాటాకు సన్నిహితుడు, ఆ సంస్థ ట్రస్టీ అయిన కృష్ణ కుమార్ 1997లో కంపెనీ వైస్ చైర్మన్‌గా మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా నియమితులయ్యారు. 2013లో రిటైర్ అయ్యారు. ఇండియన్ హోటల్స్‌కు సైతం వైస్ చైర్మన్‌గా 2013 వరకు వ్యవహరించారు. టాటా టెట్లీ అక్విజిషన్‌లో మరియు టాటా అండ్ స్టార్‌బక్స్ జాయింట్ వెంచర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
2022లో రికార్డ్ లెవల్‌లో కార్ల సేల్స్
2022లో కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం 37 పాయింట్ తొమ్మిది మూడు లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. 2021తో పోల్చితే 2022లో 23 శాతం గ్రోత్ నెలకొంది. మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. 2021లో 30 పాయింట్ ఎనిమిదీ ఒకటి లక్షల వాహనాల విక్రయాలు మాత్రమే జరిగాయి. ప్రయాణికుల వాహనాల కేటగిరీలోకి వచ్చే కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ మరియు వ్యాన్లు ఈ రేంజ్‌లో అమ్ముడుపోవటం ఇదే తొలిసారి. 33 పాయింట్ 3 లక్షల యూనిట్ల సేల్సే ఇప్పటివరకు అత్యధికం. ఈ రికార్డు ఇన్నాళ్లూ 2018 పేరిట ఉంది.
డిసెంబర్‌లో జీఎస్టీ కలెక్షన్లు సూపర్
2022 డిసెంబర్‌లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇవి 3వ అత్యధిక గ్రాస్ కలెక్షన్లు కావటం చెప్పుకోదగ్గ విషయం. ఏడాది కిందట.. అంటే.. 2021 డిసెంబర్‌లో ఒకటీ పాయింట్ 3 లక్షల కోట్ల రూపాయలు వసూలు కాగా 2022 డిసెంబర్‌లో 15 శాతం అధికంగా రావటం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. పోయినేడాది ఏప్రిల్‌లో మొదటి అత్యధిక వసూళ్లు, అక్టోబర్‌లో రెండో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. ఏప్రిల్‌లో లక్షా 67 వేల 540 కోట్ల రూపాయలు, అక్టోబర్‌లో లక్షా 51 వేల 718 కోట్ల రూపాయలు వసూలయ్యాయి.
ఇష్టంలేకపోతే ఇన్సూరెన్స్ ఇవ్వొద్దు
ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్లకు ఇష్టంలేకపోయినా ఇన్సూరెన్స్ పాలసీలను బలవంతంగా అమ్ముతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదులపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఫీల్డ్ లెవల్ స్టాఫ్‌ని హెచ్చరించింది. ఈ మేరకు సర్కిళ్ల సీజీఎంలకు రాతపూర్వకంగా తెలియజేసింది. అనైతికమైన ఈ వ్యాపార విధానానికి స్వస్తి పలకాలని కేంద్ర ఆర్థిక శాఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ ఆదేశాలను మొట్టమొదటగా ఎస్‌బీఐ అమల్లోకి తీసుకురాగా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఎస్‌బీఐని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి.
