Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!

  • రూపాయి ఇస్తే మూడు రూపాయలు వస్తాయని ఆశ
  • నిట్టనిలువునా మునిగిపోయిన ఇద్దరు అన్నదమ్ములు
  • లారీ కొనుక్కుని బతకాల్సిన వాళ్లు చివరకు
Tirupati Fake Currency Scam

Tirupati Fake Currency Scam

Counterfeit Money Scam Erpedu: రూపాయి ఇస్తే మూడు రూపాయలు వస్తాయంటే.. లాటరీ అనుకున్నారో లేక అల్లావుద్దీన్ అద్భుత దీపం అనుకున్నారో గానీ ఇద్దరు అన్నదమ్ములు నిలువునా మునిగిపోయారు. లారీ కొనుక్కుని బతకాల్సిన వాళ్లు.. నకిలీ నోట్లను చలామణి చేసి కోటీశ్వరులు అయిపోదామని షార్ట్‌కట్ వెతికారు. తీరా రూ.14 లక్షల అసలు నోట్ల బ్యాగ్‌తో టోల్‌ప్లాజాకు వెళ్తే.. కేటుగాళ్లు కారులో ఎక్కించుకుని మరీ ఉతికి ఆరేశారు. నకిలీ నోట్లు ఇవ్వడం దేవుడెరుగు.. బాధితుల వద్ద ఉన్న అసలు నోట్లను లాక్కుని హైవేపై తోసేశారు. బాధితులు ఏర్పేడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

తిరుపతి జిల్లా తడ మండలం వెల్లూరుపాడు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి, కామిరెడ్డి అన్నదమ్ములు. వీరికి తిరుపతి జీవకోనకు చెందిన గుణశేఖర్‌రెడ్డి, నెల్లూరు జిల్లా చిల్లాకూరుకు చెందిన శ్రీనివాసులుతో పరిచయం ఉంది. ఈ అన్నదమ్ములు లారీ కొనడానికి రూ.14 లక్షలు సిద్ధం చేసుకున్నారనే విషయం మాయగాళ్లకు తెలిసింది. ఎలాగైనా ఆ డబ్బును కాజేయాలని వారు ఒక ప్లాన్ వేశారు. ‘మీ దగ్గరున్న ఒక రూపాయి అసలు డబ్బు ఇస్తే.. దానికి బదులుగా మూడు రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చేవాళ్లు ఉన్నారు. వాటిని మార్కెట్లో అసలు నోట్లుగా చలామణి చేసుకోవచ్చు’ అంటూ అన్నదమ్ముల చెవుల్లో పూలు పెట్టారు.

×
×
Ad

అంటే రూ.14 లక్షలు ఇస్తే రూ.42 లక్షల నకిలీ నోట్లు వస్తాయని మాయగాళ్లు అన్నదమ్ములకు ఆశ చూపారు. ఈ బంపర్ ఆఫర్ నిజమేనని నమ్మిన అన్నదమ్ములు.. సోమవారం రాత్రి డబ్బుల బ్యాగ్‌తో ఏర్పేడు మండలం మేర్పాక టోల్‌ప్లాజాకు చేరుకున్నారు. ​అక్కడి నుంచి నిందితులకు ఫోన్ చేయగా.. నకిలీ నోట్లతో కారు వస్తోందని చెప్పారు. రాత్రి 8.30 గంటల సమయంలో తిరుపతికి చెందిన ఒక మహిళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో అక్కడకు వచ్చింది. అన్నదమ్ములను కారు ఎక్కించుకుని తిరుపతి మార్గంలో బయల్దేరింది. కారు ఏర్పేడు మండలంలోని అంజిమేడు వద్దకు రాగానే అసలు రంగు బయటపడింది.

జాతీయ రహదారిపై కారు ఆపి.. అన్నదమ్ములను చితకబాదారు. వారి వద్ద ఉన్న రూ.14 లక్షల అసలు నోట్ల బ్యాగ్‌ను లాక్కుని రోడ్డుపై తోసేసి పరారయ్యారు. ​మోసపోయామని గ్రహించిన అన్నదమ్ములు ఏడుస్తూ.. ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం అర్ధరాత్రి లోపే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆశ ఉండొచ్చు కానీ.. ఈ రేంజ్ అత్యాశ ఉంటే ఇలాగే ఉంటుందని జనం గుసగుస లాడుకుంటున్నారు.