Tirumala Srivari Salakatla Brahmotsavam 2023: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగారు. స్వర్ణరథానికి కల్యాణకట్ట నుంచి తెప్పించిన బంగారు గొలుసుతో స్వామివారిని అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. రామావతారంతో ఆంజనేయునిపై ఆసీనులై విహరిస్తున్న స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రాత్రి గజవాహనంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Also Read: PM MODI: ఈనెల 30న మహబూబ్ నగర్ కు ప్రధాని మోడీ రాక..!
ఇదిలా ఉండగా.. ఐదో రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామి గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు గరుడ సేవ ప్రారంభం అయ్యింది.చిరు జల్లుల మధ్య భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. నిత్యం మూలమూర్తి ఆభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో స్వామివారికి అలంకరించారు. ఏడాది మొత్తంలో గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్న విషయం విదితమే. మరోవైపు గ్యాలరీలలో రెండు లక్షల భక్తులు చేరినట్లు సమాచారం. గరుడవాహన దర్శనం కోసం భక్తులు పోటీ పడుతున్నారు. గరుడవాహన దర్శనం కోసం రింగ్ రోడ్డులో భక్త సంద్రం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. జగన్నాటక సూత్రదారియై తిరువీధుల్లో ఊరేగే మలయప్ప స్వామి భక్తులందరికీ దివ్యమంగళ రూపం దర్శనమిచ్చారు. జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటి నమ్మకం. అందుకే గరుడ వాహనంపై విహరించే స్వామి వారిని దర్శించుకునేందుకు.. లక్షలాది మంది ఏడుకొండలు ఎక్కి శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. ఇవాళ్టి గరుడ సేవకు కొన్ని లక్షల మంది విచ్చేసినట్లుగా తెలుస్తోంది.