NTV Telugu Site icon

Tiger Tension: పులి పేరు ఎత్తితేనే హడలిపోతున్నారు.. రైతులు, స్థానికుల్లో ఆందోళన

Tiger

Tiger

Tiger Tension: పులి పేరు ఎత్తితే చాలు పరుగులు పెడుతున్నారు ఏలూరు జిల్లాలోని పలు మండలాల ప్రజలు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పంట పొలాల్లో పులి అడుగు జాడలు కనిపించడంతో హడలెత్తిపోతున్నారు అక్కడి రైతులు, కూలీలు. ప్రశాంతమైన ప్రాంతంలో పులి పాదముద్రల జాడ బయటపడటంతో భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు అక్కడి ప్రజలు.. ఎప్పుడు ఎం జరుగుతుందుందో అనే ఆందోళణ అక్కడి జనంలో కనిపిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగాని ఏలూరు జిల్లా వాసులను పెద్దపులి ఇప్పుడు హడలెత్తిస్తోంది.

Read Also: Gedela Srinubabu: ప్రజాస్వామ్య పరిరక్షణకు యువతే కీలకం..

పంటపొలాల్లో పనులు చేసుకునే కూలీలు పాదముద్రలు చూసి మొదట అనుమాన పడ్డారు. విషయం ఆనోట ఈనోట పాకడంతో మరింత అప్రమత్తమయ్యారు రైతులు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం మేధినరావు పాలెంలో తాజాగా వెలుగు చూసిన పులిపాద ముద్రలు అక్కడి ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తున్నాయి. రెండురోజుల క్రితం ద్వారకాతిరుమల మండలంలో అలజడి సృష్టించిన పులి పాదముద్రలు ఇప్పుడు దెందులూరు మండలం చేరుకున్నాయి. మూడు నాలుగు రోజుల క్రితం బుట్టాయగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాల్లో పులి సంచరించినట్టు అక్కడి ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఒక ప్రాంతంలో ఆవును సైతం పులి తినేసింది. తాజాగా శనివారం ఉదయం దెందులూరు మండలంలోని పెరుగుగూడెం, మేదినరావుపాలెం గ్రామంలోని మొక్కజొన్న తోటలో పులిపాదముద్రలు తీవ్ర కలకలం రేపాయి. అదే రోజు ఉదయం పొలానికి నీరు పెట్టి తర్వాతి రోజు వచ్చి చూసిన రైతులకు పులి అడుగులు కనిపించడంతో అక్కడ పులి ఉందని ఫిక్సయ్యారు రైతులు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పులి సంచరించిన ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించడంతోపాటు పాదముద్రలను సేకరించారు.

Read Also: Uttar Pradesh: పెళ్లి ఆగిపోయిందని.. అమ్మాయి తల్లి, సోదరుడిని హత్య చేసిన వ్యక్తి..

సాదారణంగా 13 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పాదముద్రలు కనిపిస్తే అవి పులివిగా గుర్తిస్తారు. కానీ, ఇక్కడి పంటపొలాల్లో 18 సెంటీ మీటర్లు ఉన్న పాదముద్రలు సైతం కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ఇక్కడ సంచరించేది మగ పులి అయిఉండొచ్చనేది కొందరి వాదన. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు దృవీకరించాల్సి ఉంది. పెద్ద పులి పాదముద్రలు ఉన్నప్పటికీ.. దానిని నేరుగా చూసిన వారు ఎవరు లేకపోవడంతో మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో అటవీశాఖ అధికారులున్నారు. పెద్దపులి సంచారం కన్ఫామ్ అయితే అక్కడ బోను ఏర్పాటు చేసి దాన్ని బంధించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అప్పటి వరకు ఆప్రాంత రైతులకు కూలీలకు పెద్దపులి భయం తప్పేలా లేదు..