Tiger : తెలంగాణలో పులుల రక్షణపై ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, పులి వేట ఘటనలు మళ్లీ మానవ క్రూరత్వాన్ని బయటపెడుతున్నాయి. కొమురం భీం జిల్లా పెంచికల్ పేట మండలం ఎల్లూరులో జరిగిన ఓ పులి వేట కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పులిని చంపిన అనంతరం దాన్ని పూడ్చిపెట్టిన వేటగాళ్లు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులకు చిక్కారు. అటవీ శాఖ అధికారుల దర్యాప్తు ప్రకారం, వేటగాళ్లు ముందుగా విద్యుత్ తీగలను అమర్చి పులిని బలిగా తీశారు. అనంతరం పులి చర్మం, గోర్లు, మీసాలు వేరు చేసి, కళేబరాన్ని పూడ్చి దాచారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Fraud : జిల్లా కోర్టులో ఉద్యోగం కావాలా..? మోహన్ బ్రోకర్ వద్ద నకిలీ ఆఫర్ లెటర్ రెడీ..!
వేటకు సంబంధించిన చర్మాన్ని నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా చిన్న రాస్పల్లి గ్రామంలో శేఖర్ అనే వ్యక్తి ఇంటి వెనకభాగంలో పాతిపెట్టారు. అధికారుల తనిఖీల్లో ఈ చర్మం, గోర్లు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న చర్మం అనుమానాస్పదంగా కే 8 అనే పులికి చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. కే 8 పులి చర్మంపై ఉన్న చారలు , పట్టుబడిన చర్మం మధ్య ఎంతో పోలిక ఉందని అటవీశాఖ వర్గాలు వెల్లడించాయి. చిన్న రాస్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు, పెంచికల్ పేట మండలానికి చెందిన ఇద్దరు, మొత్తం ఐదుగురిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూడొచ్చని అధికారులు భావిస్తున్నారు. అటవీశాఖ దర్యాప్తు కొనసాగుతోంది. పులుల పరిరక్షణ కోసం మరింత కఠిన చర్యలు అవసరమన్న అభిప్రాయాలు వన్యప్రాంతాల్లో వ్యక్తమవుతున్నాయి.