ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా గురువారం (అక్టోబర్ 31) విడుదలైంది. మెగా వేలానికి ముందు, మొత్తం 46 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీ జట్లు అంటిపెట్టుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీ జట్లు తమ మేటి ఆటగాళ్లను నిలబెట్టుకున్నాయి. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వేలంలోకి అడుగుపెట్టనున్నాయి.
Read Also: Fire Accident: స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
ఇందులో భాగంగా ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ అత్యధికంగా రూ. 110.5 కోట్లు కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్ వేలానికి ముందు శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్స్‌లో రూ. 83 కోట్లు మిగిలి ఉంది. ఇది రెండవ అత్యధికం. ఇకపోతే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల రిటెన్షన్‌కు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం, ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా 6 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవచ్చు. ఒక జట్టు 6 మంది కంటే తక్కువ ఆటగాళ్లను కలిగి ఉన్నట్లయితే, ఆ సందర్భంలో వేలం సమయంలో ఫ్రాంచైజీకి రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్‌ని ఉపయోగించే అవకాశం లభిస్తుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ ప్రారంభంలో జరగవచ్చు.
Read Also: IND vs NZ: టీమిండియాకు వైట్‌వాష్ తప్పాలంటే.. రెండోరోజు ఆటే కీలకం!
ఇకపోతే ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇప్పుడు అందరి కళ్లు.. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లపై ఉన్నాయి. ఈ ముగ్గురు ఆటగాళ్లను వారి జట్లు రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ కెప్టెన్‌గా వ్యవహరించగా, లక్నో సూపర్ జెయింట్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారీగా డిమాండ్ రావచ్చు. పంత్, రాహుల్, ఇషాన్ లు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కావడం అతిపెద్ద విషయం. అంతేకాకుండా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లకు కూడా ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు కూడా కెప్టెన్ కోసం వెతుకుతున్నాయి. దాంతో ఇప్పుడు పంత్, రాహుల్‌లకు వేలంలో బిడ్డింగ్ వార్ జరగవచ్చు. ఇక ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉంది. కానీ అతని బ్యాటింగ్‌లో అంత నిలకడ కనిపించలేదు. చాలా సార్లు సెట్ అయ్యాక వికెట్లు కోల్పోతున్నాడు. అయితే, ఓవరాల్‌గా ఇషాన్ టాలెంట్‌పై ఎవరికీ అనుమానం లేకపోగా మెగా వేలంలో అతనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాడని భావిస్తున్నారు. ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి కొన్ని జట్లకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అవసరం. ఈ పరిస్థితిలో ఇషాన్‌ను కొనుగోలు చేయడానికి జట్ల మధ్య గట్టి పోరు జరగవచ్చు.