ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఇది ఐపోగానే తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. కాగా.. ఐపీఎల్ లో యువ ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. వరల్డ్ కప్ లో చోటు సాధించుకునేందుకు ఉర్రూతలుగుతున్నారు. యువ ఆటగాళ్ల గురించి పక్కన పెడితే.. సీనియర్లు కూడా తమకు వరల్డ్ కప్ లో స్థానం లభిస్తుందో లేదోనని టెన్షన్ గా ఉన్నారు. ఎందుకంటే.. ఈ ఐపీఎల్ సీజన్ లో కొందరు ముఖ్యమైన ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. అందుకే ఛాన్స్ దొరుకుతుందో లేదోనని చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి మరో నాలుగైదు రోజుల్లో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. వరల్డ్ కప్ లో ఆడే వారి వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాలి. కావున అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియాను ఎంపిక చేసే పనిలో పడింది.
మరోవైపు.. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఎవరు ఆడితే బాగుందనే అంచనా వేస్తున్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే పలువురు మాజీ ప్లేయర్లు తమ అంచనాను తెలియజేశారు. తాజాగా.. హర్భజన్ సింగ్ కూడా తన అంచనా తెలియపరిచాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆయన సెలక్ట్ చేశాడు. ఆయన జాబితాలో సీనియర్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం ఇవ్వలేదు. వీరితో పాటు కేఎల్ రాహుల్‌ను సైతం హార్భజన్ ఎంపిక చేయలేదు.
కానీ.. అనూహ్యంగా ఈ జట్టులో పేసర్ అవేష్ ఖాన్‌కు చోటిచ్చాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ తరుఫున ఆడుతున్న అవేష్ ఖాన్.. డెత్ ఓవర్లలో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇతనితో పాటు మరో యువ బౌలర్ మయాంక్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్‌కు చోటు ఇచ్చాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను సెలక్ట్ చేశాడు. స్పెషలిస్టు స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను హార్భజన్ ఎంపిక చేశాడు.
హర్భజన్ సింగ్ ఎంపిక చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్.