ఇటీవల కాలంలో గుండె పోటు కేసులు పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఎసిడిటీ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఎసిడిటీ వచ్చిన, గుండెపోటు వచ్చినా.. ఛాతిలోనే నొప్పి పుడుతుంది. అయితే చాలా మందికి గుండె నొప్పికి, ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పికి తేడా తెలియదు. ఆ తేడా తెలియకే అత్యవసర సమయంలో చికిత్స తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి గుండెపోటు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పి ఎలా ఉంటుందో తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సకాలంలో చికిత్స చేయించుకోగలరు.
ఛాతి నొప్పి అనేది చాలా సాధారణ లక్షణం. చిన్న కండరం నొప్పి నుంచి గుండెపోటు వరకు ఏదైనా దీనికి కారణం కావొచ్చు. అయితే గుండెపోటుకి సంబందించిన ఛాతినొప్పికి, ఎసిడిటీ వల్ల వచ్చే ఛాతినొప్పికి తేడా తెలియక కొంత గందరగోళం ఏర్పడవచ్చు. ఈ రెండు నొప్పుల మధ్య తేడాను మనం 100 శాతం కచ్చితంగా చెప్పలేనప్పటికి, కొన్ని సూచనల ద్వారా గుండెపోటుని గుర్తించవచ్చు. ఇలా ఛాతీలో నొప్పి వస్తున్నప్పుడు నీరు తాగితే ఆ నొప్పి కాస్త తగ్గినట్టు అనిపిస్తే… అది ఎసిడిటీ కారణంగా వచ్చిందని అర్థం చేసుకోవాలి. లేదా ఎసిడిటీకి సంబంధించిన యాంటాసిడ్లు తీసుకున్న తర్వాత ఉపశమనం లభించినా కూడా ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పి అని అర్థం చేసుకోండి. ఇలా ఛాతీలో నొప్పి తీవ్రంగా వస్తున్నప్పుడు వెంటనే నీటిని తాగండి, లేదా యాంటాసిడ్ తీసుకోండి. ఆ రెండిటి వల్ల ఉపశమనం లభిస్తే అది గుండెకు సంబంధించిన నొప్పి కాదని అర్థం. ఎందుకంటే గుండె కంటే వేగంగా పొట్ట స్పందిస్తుంది. నీరు లేదా యాంటాసిడ్ తాగగానే యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
READ MORE: Music Shop Murthy: పుష్ప కంటే ముందే మ్యూజిక్ షాప్ మూర్తి.. అదే అసలు పాయింట్: దర్శకుడు ఇంటర్వ్యూ
శారీరక శ్రమకు, గుండె నొప్పికి మధ్య సంబంధం ఉంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏదైనా పని చేస్తున్నప్పుడు గుండె దగ్గర అసౌకర్యంగా అనిపించినా, ఛాతీలో తీవ్రంగా నొప్పి వచ్చినా అది గుండెపోటుకి సంబంధించినదేమో అని అనుమానించాలి. ఆ నొప్పి వచ్చినప్పుడు చేతులను కదిలించలేరు. అలా కదిలించినా నొప్పి ఎక్కువైపోతుంది. కాబట్టి ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తున్నప్పుడు చేయి కూడా కదల్చలేని పరిస్థితి అనిపిస్తే… అది గుండెపోటు అని అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. మరికొందరికి ఎడమవైపు భాగంలో నొప్పి మొదలవుతుంది. భుజాలలో, చేతులలో తీవ్రమైన నొప్పి వస్తుంది. మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఛాతీ నొప్పితో పాటు ఈ నొప్పులు కూడా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంది.