NTV Telugu Site icon

Thief Falls Asleep: దొంగతనానికి వెళ్లి నిద్రలోకి జారుకున్న దొంగ.. కట్ చేస్తే!

Thief

Thief

Thief Falls Asleep During Robbery: ఇళ్లకు కన్నాలేసే దొంగలు చాలా అలర్ట్‌గా ఉంటారు. రాత్రి పూట అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరికీ డౌట్ రాకుండా దోచుకుని వెళ్లిపోతుంటారు. రాత్రి దొంగతనం చేసే దొంగ నిద్రకు కక్కుర్తి పడితే అడ్డంగా దొరికిపోక తప్పదు. నిద్రలోకి జారకుని ఇంట్లో వాళ్లకు దొరికాడంటే ఆ దొంగ పని అంతే ఇంక. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సరిగ్గా ఇదే జరిగింది. ఇందిరానగర్ సెక్టార్ 20లోని డాక్టర్ సునీల్ పాండే ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున దొంగ తాళం పగులగొట్టి పాత్రలు, ఇతర వస్తువులను ప్యాక్ చేసి గోనె సంచిలో ఉంచాడు. అనంతరం ఏసీ, ఫ్యాన్‌ ఆన్ చేసి అక్కడే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కల పోలీసులను చూసి షాక్ అయ్యాడు. ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, డాక్టర్లు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో జరిగింది.

Read Also: Toll Fee: వాహనదారులకు షాక్.. అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వికాస్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన దొంగను ముసద్దిపూర్ నివాసి కపిల్ కశ్యప్ గా గుర్తించారు. అవకాశం లభించిన వెంటనే కపిల్ తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువులను రెండు బస్తాల్లో ప్యాక్ చేశాడు. ఆ వస్తువులను బస్తాల్లో ఉంచి అక్కడే సిగరెట్ తాగి నిద్రపోయాడు. ఉదయం ఇరుగుపొరుగు వారు తాళం పగులగొట్టి ఉండడం చూసి ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కి చెప్పాడు.పోలీసులు, వైద్యులతో పాటు కొందరు ఇరుగుపొరుగు వారు కూడా ఇంటి లోపలికి చేరుకున్నారు. అక్కడ కపిల్ నిద్రిస్తున్నట్లు గుర్తించారు. అతడిని మేల్కొలిపి అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి ఐపిసి సెక్షన్ 379 ఎ కింద దొంగతనం కేసు నమోదు చేశారు.తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఘాజీపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) వికాస్ రాయ్ తెలిపారు. కపిల్‌పై ఆరు దొంగతనం కేసులు నమోదైనట్లు ఏసీపీ వికాస్ కుమార్ జైస్వాల్ తెలిపారు. దొంగతనం కేసులో కొన్ని నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు.