Site icon NTV Telugu

Income Tax Returns Filing: గుడ్‌న్యూస్.. వీళ్లు ఐటీ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేయవచ్చు

Income Tax Returns

Income Tax Returns

income tax returns: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు జూలై 31తో ముగియనుంది. ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అయితే ఐటీఆర్ దాఖలు ప్రక్రియలో కొందరికి మాత్రం చట్టం మినహాయింపు ఇచ్చింది. వీరు గడువు దాటిన తర్వాత సమర్పించినా ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయంలో కనీస మినహాయింపు పరిమితి దాటకపోతే తుది గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు. సెక్షన్‌ 234ఎఫ్ ప్రకారం వాళ్లకు ఆలస్య రుసుము వర్తించదన్నారు. సెక్షన్‌ 80సి నుంచి 80యూ కింద డిడక్షన్లను తీసుకోకముందు ఉండే మొత్తం ఆదాయాన్ని గ్రాస్‌ ఇన్‌కమ్‌గా పరిగణనలోకి తీసుకుంటారన్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం వయసుతో సంబంధం లేకుండా కనీస మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం 60 ఏళ్ల లోపు వారికి కనీస మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. 60-80 ఏళ్ల మధ్య వారికి ఇది రూ.3 లక్షలుగా ఉండగా.. 80 ఏళ్లు పైబడిన వారికి కనీస మినహాయింపు పరిమితి రూ.5 లక్షలుగా ఉంది.

Read Also: TFPC: పుకార్లు నమ్మొద్దంటున్న నిర్మాతల మండలి!

మరోవైపు కనీస మినహాయింపు పరిమితిని మించి ఆదాయం లేకున్నా కొందరు వ్యక్తులు కచ్చితంగా ఐటీఆర్‌ సమర్పించాలి. ఏదైనా బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఒకటి లేదా అంతకుమించి కరెంటు ఖాతాల్లో ఏక మొత్తంలో లేదా అగ్రిగేట్‌గా రూ.కోటికి మించి జమ చేస్తే ఐటీఆర్‌ సమర్పించాలి. ఏక మొత్తంలో లేదా విడతల వారీగా రూ.లక్షకు మించి విద్యుత్‌ బిల్లు దాటితే ఐటీఆర్‌ సమర్పించాలి. విదేశీ కంపెనీలలో షేర్లు ఉన్నా లేదా అందులో వాటాలు ఉన్నా లేదా ఆస్తులు ఉన్నా సదరు వ్యక్తి ఐటీఆర్ దాఖలు చేయాలి. విదేశీ ప్రయాణాల్లో రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేసినా ఐటీఆర్‌ దాఖలు చేయాలి. కాగా పూర్తిగా వేత‌నంపైనే ఆధార‌ప‌డిన ఉద్యోగులు ఐటీఆర్‌-1 ఫామ్ స‌బ్మిట్ చేస్తే స‌రిపోతుంది. ఇక స్టాక్‌మార్కెట్లలోని వివిధ సంస్థల ఈక్విటీల్లో పెట్టుబ‌డులతో లాభ‌న‌ష్టాలు ఎదుర్కొనేవారు, ఇత‌ర ప్రొఫెష‌న‌ల్‌, వ్యాపార ఆదాయ మార్గాలు క‌ల వారు ఐటీఆర్‌-2, షేర్ మార్కెట్లలో ఇంట్రాడే, ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్షన్ వ్యాపార లావాదేవీలు జ‌రిపేవారు ఐటీఆర్‌-3 ఫామ్ స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Exit mobile version