NTV Telugu Site icon

Mahashivratri 2025: హైదరాబాద్‌కి దగ్గర్లోని ప్రముఖ శివాలయాలు ఇవే..

Mahashivratri 2025

Mahashivratri 2025

రేపు మహా శివరాత్రి పర్వం.. హిందువులకు ఇదో పెద్ద పండుగ. జాగారాలు, ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భక్తులు స్థానిక శివాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తారు. కానీ.. కొందరు వృత్తి రీత్యా హైదరాబాద్‌కి వచ్చి శివరాత్రికి ఇంటికి వెళ్ల లేక పోతారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. హైదరాబాద్ నగరం, పట్నంకి దగ్గర్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

కీసరగుట్ట ఆలయం : కీసరగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ నుండి 40 కి.మీ, ECIL నుంచి 10 కి.మీ దూరంలో ఉంది. మేడ్చల్ జిల్లాలో ఉన్న ఈ ఆలయ చరిత్ర చాలా గొప్పది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. కీసరగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసుకోడానికి వారణాసి నుంచి లింగం తీసుకురమ్మని రాముడు ఆంజనేయుడిని పురమాయిస్తాడు. తీరా వారణాసి వెళ్లిన ఆంజనేయుడు.. అక్కడ ఉన్న 101 లింగాలను చూసి.. ఏ లింగం తీసుకెళ్లాలో తెలియక 101 లింగాలను తీసుకెళ్తాడట. అప్పటికీ ఆలస్యం కావడంతో శివుడే ప్రత్యక్షమై రాముడికి లింగం ప్రసాదించాడని స్థలపురాణం చెబుతుంది. తాను తెచ్చిన లింగాలకు పూజ చేయలేదని ఆగ్రహించిన హనుమంతుడు లింగాలను విసిరి పారేశాడట. అందుకే.. కీసరలో ఎక్కడ చూసినా.. లింగాలే కనిపిస్తాయి.

చెరువుగట్టు : శ్రీరాముడు ప్రతిష్టించిన చిట్టచివరి లింగమే చెరువుగట్టు రామలింగేశ్వరుడిగా చెప్పుకుంటారు. నల్గొండ పట్టణానికి సమీపంలో నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. శివరాత్రి రోజు ఇక్కడ భక్తులు అగ్నిగుండాలు తొక్కడం ప్రత్యేకం. రేపు ఇక్కడ కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం (మెదక్): ఏడుపాయలు పుణ్య క్షేత్రం గురించి తెలంగాణ ప్రాంత ప్రజలు సుపరిచితమే. ఈ ఆలయం హైదరాబాద్‌కు సమీపంలో ఉంటుంది. మెదక్ జిల్లా పరిధిలోని పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మెదక్ నుంచి 14 కి.మి దూరంలో ఉంది. దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం ఇస్తారు.
ఆలయం ఎదుట పారే మంజీరా నదిలో శివుడి విగ్రహాం ఉంటుంది.

శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం(గౌలిగూడ): భాగ్యనగరంలోని గౌలిగూడ శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథుడి రూపంలో ఉన్న శివుడికి అంకితం చేశారట.

శ్రీ సోమనాథ్ ఆలయం (చార్మినార్ ) : హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో శ్రీ సోమనాథ్ ఆలయం ఉంది. దీని చరిత్ర దాదాపు 500 ఏళ్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. రేపు ఈ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

అనంత పద్మనాభ స్వామి ఆలయం(అనంతగిరి) : అనంతర గిరి గురించి పట్నం వాసులకు పెద్దగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే వికారాబాద్ దగ్గరలో అనంతగిరి ఉంది. ఇక్కడ ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి విగ్రహం కలిగిన ప్రముఖ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.

శ్రీ హాటకేశ్వర్ ఆలయం (కార్వాన్): కార్వాన్ లో శ్రీ హాటకేశ్వర్ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.

శ్రీ మహాదేవ్ ఆలయం (ఫిల్ ఖానా): పట్నం నడిబొడ్డున ఓ ప్రముఖ శైవక్షేతం ఉంది. ఇది ఫిల్ ఖానా ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం పేరు శ్రీ మహాదేవ్ ఆలయం. ఇక్కడికి కూడా మహాశివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయానికి సైతం చరిత్ర ఉంది.