NTV Telugu Site icon

Terrorist Died: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్ట్ మృతి..

Gajinder Sing

Gajinder Sing

పాకిస్థాన్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఐఏ) విమానాన్ని హైజాక్ చేసిన వాంటెడ్ టెర్రరిస్ట్ గజిందర్ సింగ్ (74) మరణించాడు. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. గజిందర్ సింగ్ ఒక పేరుమోసిన ఉగ్రవాది, అతను ఖలిస్తాన్ అనుకూల సంస్థ “దాల్ ఖల్సా” సహ వ్యవస్థాపకుడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-423 హైజాక్‌లో ప్రధాన కుట్రదారుల్లో ఇతను ఒకడు. శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం హైజాక్‌కు గురై పాకిస్థాన్‌లోని లాహోర్‌కు దారి మళ్లించారు.

కాగా.. గజిందర్ మరణ వార్తను కుమార్తె బిక్రమ్‌జిత్ కౌర్ ధృవీకరించినట్లు దాల్ ఖల్సా ప్రతినిధి పరమ్‌జిత్ సింగ్ మాండ్ తెలిపారు. ఆమె కుమార్తె తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో యూకే (UK) లో నివసిస్తుంది. గజిందర్ భార్య మంజీత్ కౌర్ 2019 జనవరిలో జర్మనీలో మరణించారు. ఛాందసవాద సంస్థ దాల్ ఖల్సా సహ వ్యవస్థాపకుడు గజిందర్ 2002లో 20 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేరారు. 1981 సెప్టెంబర్ 29న 111 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి లాహోర్‌లో బలవంతంగా ల్యాండ్ చేసిన ఐదుగురిలో ఇతను కూడా ఉన్నాడు. ఆ సమయంలో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో పాటు పలువురు ఖలిస్థానీ తీవ్రవాదులను విడుదల చేయాలని గజిందర్ సింగ్ డిమాండ్ చేశారు.

UK-INDIA: నూతన బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్..బ్రిటన్‌-భారత్ మధ్య సంబంధాల పరిస్థితేంటి..?

ఈ హైజాకింగ్ సమయంలో గజిందర్ సింగ్.. అతని తోటి ఉగ్రవాదులు ప్రయాణీకులను బందీలుగా పట్టుకున్నారు. భారత ప్రభుత్వం నుండి తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన తర్వాత.. గజిందర్ సింగ్, అతని సహచరులను పాకిస్తాన్‌లో అరెస్టు చేసి జైలు శిక్ష విధించారు. అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చి దేశ భద్రతకు సవాలు విసిరిన ప్రమాదకరమైన ఉగ్రవాదిగా గజిందర్ సింగ్ పేరు భారత చరిత్రలో నమోదైంది. ఈ హైజాక్ ఘటనలో తేజిందర్ పాల్ సింగ్, సత్నామ్ సింగ్ పవోంటా సాహిబ్, దల్బీర్ సింగ్ మరియు కరణ్ సింగ్ అనే ఇతర ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వారిని 1981 సెప్టెంబరు 30న పాకిస్తాన్ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. లాహోర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం విచారించి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1994 అక్టోబరు 31న వారికి శిక్షాకాలం పూర్తయింది.

గజిందర్ సింగ్ 1996 లో జర్మనీకి వెళ్లాడు. అయితే భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదని తెలిసింది. మళ్లీ తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియలేదు. 2022 సెప్టెంబర్లో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని హసన్ అబ్దాల్‌లోని గురుద్వారా పంజా సాహిబ్ ముందు నిలబడి ఉన్న ఫొటోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత.. అతని ఆచూకీ కనుగొనలేదు.