NTV Telugu Site icon

Master Plan: మాస్టర్ ప్లాన్ ఉద్యమం ఉధృతం.. భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన జేఏసీ

Kamareddy Master Plan

Kamareddy Master Plan

Master Plan: కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాని డిమాండ్ చేస్తూ.. రైతులు ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేయాలని నిర్ణయించారు. కామారెడ్డి మున్సిపల్ పాలక వర్గం తమ పదవులకు రాజీనామా చేయాలని డెడ్ లైన్ పెట్టారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల విజ్ఞప్తికి.. బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్ల పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నెల 20న గంప ఇళ్లు ముట్టడించాలని రైతు జేఏసీ అత్యవసర సమావేశంలో తీర్మాణించారు. ఇండస్ట్రీయల్ జోన్ లో తన భూమి పోతుందని ఆవేదనతో.. మరో రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం ఉద్రిక్తతకు దారితీస్తోంది.

Read Also: Sabitha Indra Reddy: బదిలీల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరుగవద్దు

మాస్టర్ ప్లాన్ పై పాత రాజం పేటలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 9 విలీన గ్రామాల రైతులు పాల్గొన్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యచరణ పై చర్చించిన రైతులు… ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈనెల 19 తేదీ వరకు మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ లో తీర్మానం చేయాలని ఈ మేరకు.. పాలకవర్గం పై ఒత్తిడి చేసేలా కార్యాచరణ రూపొందించారు. విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా.. బీజేపీ 2వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి, 11వ వార్డు కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను రైతు జేఏసీకి అందజేశారు. అధికార పార్టీకి చెందిన మిగతా కౌన్సిలర్లు తమ పదవులకు 19తేదీ లోపు రాజీనామా చేయాలని లేని పక్షంలో 20న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు రైతులు.

Read Also: Hotel Bill : లగ్జరీ హోటళ్లో దిగాడు.. లక్షల బిల్లు ఎగ్గొట్టాడు

మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా.. 45 రోజులుగా ఉద్యమం చేస్తున్న విలీన గ్రామాల రైతులు.. మున్సిపల్ పాలక వర్గం రాజీనామాలే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. రైతుల గుంట భూమి కూడా నష్టం కలిగించే ప్రసక్తే లేదనీ చెప్తున్న కలెక్టర్, కమిషనర్, MLA లు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 19 వ తేదీన మున్సిపల్ సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో.. అధికార పార్టీ కౌన్సిలర్లు అయోమయంలో పడ్డారు. మాస్టర్ ప్లాన్ తన భూమి పోతుందని ఆవేదనతో.. రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన మర్రి బాలకృష్ణ విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. బాధితున్ని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నారు. నేడు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించిన రైతులు.. 19న కౌన్సిలర్ల రాజీనామాకు ఒత్తిడి తేవాలని, 20న ఎమ్మెల్యే ఇళ్లు ముట్టడిస్తామని స్పష్టం చేశారు. 20 నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేసేలా కార్యచరణ ఉంటుందని సంకేతాలిచ్చారు. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండటంతో.. అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.