Site icon NTV Telugu

JP Nadda: ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

Jp Nadda

Jp Nadda

JP Nadda on the Kerala Story: వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కొత్త తరహా ఉగ్రవాదాన్ని బయటపెట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగళూరులో ఈ చిత్రాన్ని ఆయన ఆదివారం వీక్షించారు. బెంగళూరులోని గరుడ మాల్‌లో వేసిన స్పెషల్ షోకు కర్ణాటక శాఖ బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, రాజీవ్ చంద్రశేఖర్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై, బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్యతో కలిసి జేపీ నడ్డా ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ‘కళ్లు తెరిపిస్తుంది’ అని అన్నారు. ఎలాంటి తుపాకులు, తూటాలు లేకుండానే టెర్రరిజాన్ని ఎలా వ్యాప్తి చెందింపజేయాలో ఈ చిత్రం చూపిందని అన్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులో ఈ మూవీని చూసిన జేపీ నడ్డా.. ‘న్యూ టైప్ ఆఫ్ టెర్రరిజం’ గురించి తామిప్పుడు తెలుసుకున్నామన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం తూటాలు, బాంబులు, ఆటోమాటిక్ ఆయుధాలను వాడుతారని తాము విన్నామని, కానీ అవేవీ లేకుండానే ప్రమాదకరమైన ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని ఈ చిత్రం ఎక్స్ పోజ్ చేసిందని ఆయన చెప్పారు.

ఈ తరహా ఉగ్రవాదానికి ఏ రాష్ట్రానికో, మతానికో సంబంధం లేదన్నారు. ఈ సినిమా చూశాక మన సమాజాన్ని శూన్యం చేయడానికి ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో ప్రజలకు అర్థమవుతుందని జేపీ నడ్డా అన్నారు. ఈ విషయం మనం తెలుసుకోవాలని సూచించారు. తప్పుడు దారిలో ప్రయాణిస్తున్న మన యువతకు ఈ సినిమా కనువిప్పు వంటిదని, అందరూ దీన్ని చూడాలని తాను అభిప్రాయపడుతున్నానని నడ్డా పేర్కొన్నారు. ప్రధాని మోడీ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారం నిర్వహించడానికి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ సినిమా చూశారు.

Read Also: Pakistan: జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్

అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది కేరళ స్టోరీ’ కేరళలోని మహిళల సమూహం చుట్టూ తిరుగుతుంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ సినిమా విడుదలపై స్టే ఆర్డర్ ఇవ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించడంతో మే 5న థియేటర్లలోకి వచ్చింది. కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, ఆ తర్వాత ఐసిస్ లో చేరారని చూపించిన ఈ సినిమా ట్రైలర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిర్మాతలు స్పందించారు. ఈ సినిమా కేరళకు చెందిన ముగ్గురు మహిళల కథ అని వివరించారు. కాగా.. గత శుక్రవారం కర్ణాటకలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. దీంతో ఈ చిత్రం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version