ప్రధాని మోడీకి (PM Modi) చెందిన ఓబీసీ కులంపై రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను కేంద్రం తోసిపుచ్చింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒడిషాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ప్రధాని మోడీ ఓబీసీ కాదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై కేంద్రం స్పష్టత నిచ్చింది. ప్రధాని మోడీ ఘాంచీ కులానికి చెందిన కుటుంబంలో జన్మించారని తెలిపింది. 2000 సంవత్సరంలో గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) ఆ కులాన్ని ఓబీసీ విభాగంలో చేర్చిందని వివరించారు.
గుజరాత్‌లో ఒక సర్వే అనంతరం మండల్ కమిషన్ ఓబీసీ జాబితాను తయారు చేసిందని తెలిపింది. అందులో ఘాంచీ కులం పేరు కూడా ఉందని పేర్కొంది. ఘాంచీ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు జులై 25, 1994లో నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తుచేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్ 4, 2000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా దానిని ఓబీసీ జాబితాలోకి చేర్చారని కేంద్రం వెల్లడించింది.
ఎన్నికల ముందే మోడీ(Modi)కి తాను ఓబీసీననే విషయం గుర్తుకువస్తుందని రాహుల్ విమర్శించారు. లేదంటే కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే అని చెప్తారన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఉద్దేశించి బుధవారం పార్లమెంట్‌లో మోడీ స్పందించారు. దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాల వారికి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసిందని తెలిపారు. బీజేపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు.