NTV Telugu Site icon

ODI World Cup 2023: భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడమే అతిపెద్ద సవాల్‌!

India Team New

India Team New

Ravi Shastri React on Indian Playing XI for ODI World Cup 2023: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023కి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో గురువారం (అక్టోబర్ 5) మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని జట్లకు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం అతిపెద్ద సవాల్‌ అని టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇందుకు టీమిండియా మినహాయింపేమీ కాదని తెలిపారు.

గురువారం నుంచి వన్డే ప్రపంచకప్‌ 2023 మొదలుకానున్నా.. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో భారత్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచులో భారత తుది జట్టులో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువని రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘జట్టు కోసం ప్రతి ఒక్కరూ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. భారత జట్టులో ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ చేరడంతో.. తుది జట్టు ఎంపిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుల్దీప్ యాదవ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తే.. తర్వాతి మ్యాచుల్లో స్థానం మాత్రం సుస్థిరం కాదు. అయితే అతడి బౌలింగ్‌పై ఎలాంటి సందేహాలు లేవు’ అని రవిశాస్త్రి అన్నారు.

Also Read: Anushka Sharma Post: ప్రెగ్నెంట్ రూమర్స్.. అనుష్క శర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌!

‘కుల్దీప్ యాదవ్‌ అద్భుతమైన బౌలర్. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన అతడు ఇటీవల నాణ్యమైన బౌలింగ్‌ వేశాడు. వికెట్స్ కూడా పడగొట్టాడు. పిచ్ పొడిగా ఉంటే మాత్రం కేవలం ఇద్దరు ప్రధాన పేసర్లతోనే భారత్ బరిలోకి దిగాలి. అప్పుడు ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంటుంది. హార్దిక్ పాండ్యా రూపంలో టీమిండియాకు పేస్‌ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండనే ఉన్నాడు’ అని రవిశాస్త్రి చెప్పారు. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌ కుల్దీప్ అని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్ జోస్యం చెప్పాడు. ఆసియా కప్‌ 2023లో కుల్దీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు.