ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అన్ని ఫార్మాట్లలో నిలకడ, దూకుడు శైలి, నాయకత్వ లక్షణాలు క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాయి. ఆట పట్ల విరాట్‌కు ఉన్న అభిరుచి, అంకితభావం అతన్ని క్రికెట్‌లో అత్యంత ఉన్నత శిఖరాలకు చేర్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్.. ఒకానొక దశలో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. ఆపై తిరిగి పుంజుకున్నాడు. అందుకే విజయాలను మాత్రమే కాకుండా.. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండటం చాలా ముఖ్యమని కోహ్లీ అంటున్నాడు.
విరాట్ కోహ్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘జీవితం లేదా కెరీర్ ఏదైనా సరే గొప్పగా లేనప్పుడు ఎలా స్పందిస్తారు?, వాటిని ఎదుర్కొని ఎలా ముందుకుసాగుతారు? అనే విషయాలు చాలా సున్నితమైనవి. ఫలితాలు మనకు అనుకూలంగా రానప్పుడు ఏ పనీ చేయలేం. ప్రాక్టీస్‌కు చేద్దామని కానీ.. జిమ్‌లో కసరత్తులు చేద్దామని కానీ ఆసక్తి ఉండదు. జీవితంలో కేవలం విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకోవడమే కాదు క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండాలి. ఎప్పుడూ కఠినంగా శ్రమించాలి. సక్సెస్‌తో సంబంధం లేకుండా కష్టపడాలి. నావరకైతే అదే అసలైన గేమ్. ఇదంతా దేవుడి పరీక్షగా భావించాలి. ఉన్నత స్థాయిలో కష్టపడకపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేం’ అని అన్నాడు.
Also Read: Lakshya Sen: వచ్చేసారి పతకం సాధిస్తా.. ప్రధాని మోడీతో లక్ష్యసేన్!
2020, 2021, 2022లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. దాదాపు మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించినా.. సెంచరీ లేదని చాలా విమర్శలు వచ్చాయి. చివరిగా 2022 టీ20 ప్రపంచకప్‌లో శతకం చేశాడు. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. ఇటీవల శ్రీలంకపై వన్డే సిరీస్ ఆడిన విరాట్.. ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం వచ్చే నెలలో స్వదేశానికి రానున్నాడు.