NTV Telugu Site icon

Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు

Nagarjuna

Nagarjuna

Nagarjuna Akkineni: ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేతలపై అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ ను ఇవాళ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు. ఈ క్రమంలోనే కూల్చివేతలు ఆపాలని జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాగార్జునకు తాత్కాలిక ఊరట దక్కినట్లు అయింది.

Read Also: Nagarjuna: ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్..

హైదరాబాద్ మాదాపూర్‏లో ఆయనకు చెందిన ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‏ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కూల్చివేతలను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం వల్ల అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వ్యవహారం పై కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. అన్నట్లుగానే హైకోర్టులో కూల్చివేతలు వెంటనే ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు.

ఈ విషయంపై విచారణ జరిపిన జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలపై హైడ్రా అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. హైడ్రా అధికారుల వాదనపై సంతృప్తి చెందని ధర్మాసనం వెంటనే కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే కూల్చివేతలపై స్టే ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరించి ఎన్ కన్వెషన్ ను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయడం సరికాదన్న నాగార్జున వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.