తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్ లో డొంక కదిలిస్తున్నారు సీసీఎస్ పోలీసులు. ఈ స్కాంలో పాత్రధారులతో పాటు సూత్రధారులను బయటకు లాగుతున్నారు. ఇప్పటికే పలువురిన అరెస్ట్ చేశారు. లేఖలు, డిపాజిట్ పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోర్జరీ ఎవరు చేశారు ఎందుకు చేశారో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ స్కాంపై ప్రభుత్వం వేసిన త్రి సభ్య కమిటీ ఈరోజు నివేదిక ఇచ్చే అవకాశముంది. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అగ్రసేన్ బ్యాంకు అధికారులనూ సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు అకాడమీ అధికారులు బ్యాంకులపై… బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ సిబ్బందిపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో వీళ్లందరినీ ఒకేసారి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీ డైరెక్టర్, అకౌంట్స్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే డిపాజిట్ పత్రాలు, లేఖలను సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోర్జరీ చేసినట్లు తేలితే.. ఎవరు ఈ మోసానికి పాల్పడ్డారనే దానిపై స్పష్టత రానుంది. 63 కోట్ల రూపాయల డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి అక్కడి నుంచి విడతల వారీగా నగదు విత్ డ్రా చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు కూడా నగదును తీసుకున్నారు. ఏపీ మర్కంటైల్ సొసైటీ క్లర్క్ మొహిద్దీన్ నగదును నిందితులకు అందజేశారు. నగదు తీసుకున్నది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి సహాయకుడిగా వ్యవహరించిన రాజ్ కుమార్… ఈ తతంగంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఏజెంట్లు కలిసి నకిలీ డిపాజిట్ పత్రాలు, లేఖలు సృష్టించి మోసానికి తెరలేపినట్లు భావిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కస్టడీకి అనుమతిస్తే… నలుగురు నిందితులను ప్రశ్నించడం ద్వారా మరికొంత సమచారం వచ్చే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ ఈరోజు నివేదిక ఇచ్చే అవకాశముంది. ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపింది. ఈనెల రెండో తేదీకే ప్రభుత్వం నివేదిక కోరినప్పటికీ, పూర్తిస్థాయి క్లారిటీ కోసం కమిటీ గడువు కోరింది.