Site icon NTV Telugu

Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

Assembly

Assembly

Assembly Sessions: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 13) ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల వ్యవధి, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 14న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఆ తీర్మానం ఆమోదం పొందిన తరువాత సభ వాయిదా పడనుంది.

Read Also: Bhadrachalam: ఆన్‌లైన్‌లో భద్రాచలం శ్రీరామనవమి కల్యాణోత్సవ టికెట్లు.. ఈఓ వెల్లడి

ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ గత బడ్జెట్ కంటే దాదాపు 10 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. గత ఏడాది రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్ ఉండొచ్చని సమాచారం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదం పొందిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రెండు ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వీటిలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు ఉన్నాయి. ఈ బిల్లులపై చర్చ జరిపి, ఆమోదించనున్నారు. మార్చి 19 లేదా 20న 2025-26 బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు. మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్‌పై విభాగాల వారీగా చర్చ జరిగి, ఆమోదించేందుకు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీనికి అనుగుణంగా మార్చి 27 లేదా 29 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చని అంచనా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఇప్పటికే మూడంచెల భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ తమ తమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ప్రాధాన్యంగా తీసుకుంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీల వర్గీకరణ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ప్రస్తావించనుంది.

Read Also: Shahid Afridi: ఐసీయూలో పాకిస్తాన్ క్రికెట్.. పీసీబీపై విరుచుకుపడ్డ షాహిద్ అఫ్రిది

ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. ఆరు గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, కరువు పరిస్థితులు, సాగునీటి కొరత, రైతుల సమస్యలు వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో తమ వ్యూహాలను అమలు చేయాలనీ భావిస్తోంది.

Exit mobile version