తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు బాలీవుడ్ మెగా స్టార్లు రానుండటం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న ఈ అంతర్జాతీయ వేదికకు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ హాజరు కానున్నట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఇద్దరు నటులు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం హర్షోల్లాసంగా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం జరగనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను సల్మాన్ ఖాన్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. అక్టోబర్ 30న ముంబైలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధి రేటుతో ఆయన ముచ్చటపడి, రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేయడానికి తాను కూడా భాగస్వామి అవుతానని హామీ ఇచ్చారు.
Economy vs Rupee: వృద్ధిలో భారత ఆర్థిక వ్యవస్థ.. రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది..?
అలాగే, నటుడు–నిర్మాత అజయ్ దేవగణ్ కూడా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఐ ఆధారిత స్మార్ట్ స్టూడియోలను నెలకొల్పడంతో పాటు ఫిల్మ్ రంగానికి అవసరమైన నైపుణ్య వనరులను తీర్చేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సంస్థను స్థాపించాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన ప్రణాళికలను వివరించిన విషయం తెలిసిందే.
ఈ సమ్మిట్‌లో ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ విజన్ 2047” పత్రాన్ని ఆవిష్కరించనుంది. 2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ విజన్ రూపొందించారు. సల్మాన్, అజయ్ దేవగణ్ వంటి ప్రముఖుల భాగస్వామ్యం రాష్ట్ర క్రియేటివ్ ఎకానమీని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.