NTV Telugu Site icon

Davos Tour: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం బిజీ బిజీ..

Davos Cm

Davos Cm

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజున వరుసగా వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సాంబానోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ.. ఏఐ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అందించటంలో పేరొందిన సంస్థతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి.

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో దిగ్గజ కంపెనీతో చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ అధికారులు యూనిలివర్ సీఈవో హీన్ షూమేకర్, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను చర్చించారు.

Read Also: Kamala Harris: కమలా హారిస్ ఫ్యూచర్ ఫ్లాన్ ఇదేనా? 2 ఏళ్ల తర్వాత ఏం చేయబోతున్నారంటే..!

దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం:
యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలివర్‌ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన మొదటి సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్ ను కలిశారు. ఎజిలిటీ సంస్థ ప్రపంచంలో పేరొందిన లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో ఆయనతో పంచుకున్నారు.