Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మార్చి 17 వరకు అవకాశం..

  • ఈ నెల రేషన్ బియ్యం పంపిణీ గడువు మార్చి 17..
  • ఏప్రిల్‌లో మూడు నెలల బియ్యం..
  • సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు..
Ration Shop

Ration Shop

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు అందే రేషన్ బియ్యం తెలంగాణలో కీలకమైన సంక్షేమ పథకం. సాధారణంగా ప్రతి నెలా 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల బియ్యం తీసుకోలేకపోయిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం తాజాగా గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మార్చి 17 వరకు బియ్యం తీసుకోవచ్చు.. 
ప్రస్తుత మార్చి నెలకు సంబంధించి రేషన్ పంపిణీ గడువు ఈ రోజుతో (మార్చి 15) ముగియాల్సి ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా చాలా మంది లబ్ధిదారులు బియ్యం తీసుకోలేదని గుర్తించిన ప్రభుత్వం, మరో రెండు రోజుల పాటు గడువును పొడిగించింది. దీని ప్రకారం.. రేషన్ కార్డుదారులు మార్చి 17వ తేదీ వరకు తమకు దగ్గర్లో ఉన్న రేషన్ డీలర్ల వద్ద బియ్యం తీసుకోవచ్చు. ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది.

ఏప్రిల్‌లో ‘త్రిపుల్’ ధమాకా..
వచ్చే నెల ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల రేషన్‌ను (ఏప్రిల్, మే, జూన్) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. వృద్ధులు, మహిళలు ప్రతి నెలా క్యూలైన్లలో నిలబడి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న ‘సన్నబియ్యం’ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున.. మూడు నెలలకు కలిపి ఒకేసారి 18 కిలోల బియ్యం అందజేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ‘సన్నబియ్యం’ పథకం దాదాపు 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తోంది.