నేరాలను అదుపుచేసేందుకు పోలీసులు ఎంతో శ్రమిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతర రాష్ట్రాలకు కూడా వెళతారు. అయితే కొంతమంది కష్ట పడితే ఇతరులు ఆ క్రెడిట్ కొట్టేస్తారు. ఫలితం మరొకరిది అన్న చందంగా నెల్లూరు జిల్లా పోలీసు శాఖలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. నగరంలో జరిగిన ఓ భారీ దొంగతనం కేసును నెల్లూరు పోలీసులు ఛేదిస్తుండగా.. తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల సమాచారం మా దగ్గర ఉందని, తామే విచారించి చోరీసొత్తు రికవరీ చేస్తామంటూ తెలంగాణకు తీసుకువెళ్లారు. దాంతో తమ శ్రమంతా వృథా అయిందని నెల్లూరు పోలీసులు గెత ఫీలవుతున్నారు. నెల్లూరు మిలిటరీ కాలనీలోని మైన్స్ విశ్రాంత జేడీ ఇంట్లో నెల కిందట భారీ దొంగతనం జరిగింది. ఆయన కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్‌లో స్థిరపడగా.. అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చి వెళ్లేవారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన గుర్తుతెలియని దుండగులు గత నెల 12వ తేదీ అర్ధరాత్రి వాటిని పగలగొట్టి లోనికి ప్రవేశించి బంగారు నగలు, నగదు చోరీ చేశారు. మొత్తం రూ. 1.75 కోట్ల విలువ చేసే సొత్తు అపహరణకు గురైందన్న ఫిర్యాదుపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎస్పీ సీహెచ్ విజయారావు.. దర్గామిట్ట పోలీసులు, సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును స్వయంగా పర్యవేక్షించారు. సీసీ టీవీల సాయంతో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. భీమవరానికి చెందిన ఇద్దరు పాత నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నెలతర్వాత దొంగలను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు రాజమహేంద్రవరం, భీమవరం తదితర ప్రాంతాల్లో గాలింపు మొదలుపెట్టారు. అయితే.. విశ్రాంత జేడీ కుమార్తె తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారి కావడంతో నెల్లూరులో చోరీ కేసు ఛేదించేందుకు అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు.
నెల్లూరు సీసీఎస్‌కు చెందిన ఓ పోలీసు అధికారి అత్యుత్సాహంతో నిందితుల సమాచారాన్ని తెలంగాణ పోలీసులకు చేరవేశారు. దొంగలను తాము అదుపులోకి తీసుకున్నామని, నెల్లూరు ప్రత్యేక బృందాలు వెనక్కు వెళ్లిపోవచ్చని చెప్పడం గమనార్హం. అక్కడి పోలీసులకు సమాచారం చేరవేసిన సీసీఎస్ అధికారిపై నెల్లూరు పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి.. విచారణకు ఆదేశించారు. తాము కష్టపడితే తెలంగాణ పోలీసులు దానిని ఎగరేసుకుపోయారని నెల్లూరు పోలీసులు ఆవేదన చెందుతున్నారు.
Read Also: Tamilnadu Crime: టీ పెట్టిన చిచ్చు.. వేడిగా లేదన్న పాపానికి, కోడలి కిరాతకం