Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నామని, సుస్థిర పాలన అందిస్తున్నామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్‌పై చర్చ జరుగుతుంది కానీ ముందుకు కదలడం లేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి కోమటిరెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరామన్నారు. రోజుకి 60 వేల వాహనాలు తిరుగుతాయని.. 370 చోట్ల ప్రమాద జోన్లను గుర్తించామన్నారు.
Read Also: Rahul gandhi: ఆ విషయంలో మోడీ బిజీగా ఉన్నారు
త్వరగా హైదరాబాద్- విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారి పనులు చేపట్టాలని కోరామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పారని మంత్రి వెల్లడించారు. 16 రోడ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నూతన జాతీయ రహదారుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారని మంత్రి చెప్పారు. ఉప్పల్- ఘట్‌కేసర్ ఫ్లయిఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదేశించారన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారన్నారు. రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరవుతానని మంత్రి తెలిపారు. తాను అభివృద్ధి పనుల కోసం వచ్చానని వెల్లడించారు. నేషనల్ హైవే నిధులు ఎక్కువగా తెలంగాణకు ఇవ్వాలని కోరామన్నారు. వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ-హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు.
బండి సంజయ్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. ఈరోజు నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయానికి వెళ్లిన కోమటిరెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ ను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు బండి సంజయ్ ఈరోజు పార్లమెంట్ లో కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.