Bio Asia 2023: ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణను కేంద్రంగా మార్చడమే సర్కారు లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయో ఆసియా–2023’ హెచ్‌ఐసీసీలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్ డాలర్లను దాటుతుందని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నామన్నారు. వాటి సాయంతో లైఫ్ సైన్సెస్ రంగానికి కొత్త రూపు ఇస్తామని మంత్రి ప్రకటించారు. భారత ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం హైదరాబాద్ లోని లైఫ్‌సైన్సెస్ కంపెనీలు వినూత్న, జెనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి.
Read Also: Bio Asia : ఇకపై ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, బయోలాజికల్–ఈ, భారత్ బయోటెక్, శాంతా బయోటెక్, అరబిందో, హెటెరో, గ్లాండ్ ఫార్మా, విర్చో బయోటెక్ వంటి కీలక సంస్థలు ఇక్కడ ఉండటంతో.. జీవ ఔషధాల ఉత్పత్తిలో దేశంలోనే హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటయ్యే బయో ఫార్మాహబ్ (బీ హబ్), హైదరాబాద్ ఫార్మాసిటీలతో తమ సామర్థ్యం మరింత బలోపేతమవుతుందన్నారు మంత్రి కేటీఆర్. కణ, జన్యు చికిత్సల రంగంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు కొత్త తరహా నివారణ, చికిత్సల వాణిజ్యీకరణ లక్ష్యంతో హైదరాబాద్‌లో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యూరేటివ్ మెడిసిన్’ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆసియాలో ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి సేవలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో.. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులు జీనోమ్ వ్యాలీలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థలతోపాటు మానవ వనరులు, ఔషధ రసాయన శాస్త్రం, డిస్కవరీ బయాలజీ, ప్రీ–క్లినికల్, క్లినికల్, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్ ప్రొడక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సహా వివిధ సేవలు అందించే భారతీయ, బహుళజాతి ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లకు హైదరాబాద్ నిలయంగా ఉంది.