గండిపేట మండలం పీరంచెరువు పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. ఈ క్రమంలో నిఖేశ్ కూమార్‌కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిఖేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు మొత్తం 20 వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దాదాపు రూ. 200 కోట్లకు పైగా విలువగల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నిఖేశ్ కుమార్‌కు కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొయినాబాద్‌లో మూడు ఫాంహౌజ్‌లు, మూడు విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. తన ఎస్బీఐ అకౌంట్ ద్వారా నిఖేష్ కుమార్ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నిఖేష్ కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Rain Alert : పుదుచ్చేరిలో 47 సెంటీమీటర్ల వర్షం.. ఇళ్లలోకి వరద.. భారీ నష్టం.. ఆర్మీ పిలుపు
ఆరు నెలల క్రితం లంచం తీసుకుంటూ నిఖేష్ కుమార్ పట్టుబడ్డాడు. అతని వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ రైడ్ చేసింది. ఆ సమయంలో రూ. 100 కోట్లకు పైగా విలువ చేసే అక్రమాస్తులు బయటపడ్డాయి. అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు అధికారులు. 2 నెలల తర్వాత బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చాడు. అప్పటి కేసులో మళ్లీ తాజాగా తీగ లాగారు. దీంతో కళ్లు తేరేసే రీతిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. తాజాగా మరోసారి ఆయన్ను అరెస్ట్ చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Drunk and Drive: వీరంగం సృష్టించిన మందుబాబు.. పోలీసులతో వాగ్వాదం
గండిపేట చెరువు అక్రమ నిర్మాణాలలో నిఖేష్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాడు. నిఖేష్ కుమార్ గండిపేట ఇరిగేషన్ ఏఈఈగా పనిచేశాడు. ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్ (గండిపేట) చెరువును కాపాడాల్సిన నిఖేష్.. నిర్మాణాలకు అనుమతి ఇచ్చాడు. చెరువు, ఎఫ్టీఎల్ బఫర్‌లను కబ్జా చేస్తుంటే చూసి చూడనట్టు వదిలిపెట్టాడు. కోకాపేట, గండిపేట, నార్సింగ్, మంచి రేవుల అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చాడు. ఈ ప్రాంతంలో బుల్కాపూర్ నాళా, మూసి పరిధిలో అపార్ట్మెంట్, విల్లాలు అనుమతి ఇచ్చాడు. నిఖేష్ ప్రముఖ కంపెనీలకు అనుమతి ఇచ్చి షేర్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.