Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందింది. శనివారం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో శనివారం ఉదయం నుంచే బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. ఇక రాబోయే కొన్ని గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు పరిసరాల్లో మొదలైన ఉరుముల వానలు జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకూ వ్యాపించి, పిడుగులు, ఈదురుగాలులతో విరుచుకుపడే అవకాశం ఉందని సమాచారం. రానున్న కొన్ని గంటల్లో వర్షం జోరు మరింత పెరిగే సూచనలు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక శనివారం కురిసిన వర్షాలకు ముఖ్యంగా దక్షిణ, మధ్య హైదరాబాద్ ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. అత్యధికంగా హయత్‌నగర్‌లో 63.3 మి.మీ, శంషాబాద్ విమానాశ్రయంలో 59.5 మి.మీ నమోదు కాగా, రాజేంద్రనగర్ (44.3 మి.మీ), శివరాంపల్లి (44 మి.మీ), మైలార్‌దేవ్‌పల్లి (40.3 మి.మీ), తట్టిఅన్నారం (39.3 మి.మీ) ప్రాంతాల్లోనూ మంచి వర్షపాతం పడింది. అలాగే షేక్‌పేట (31.3 మి.మీ), సరూర్‌నగర్ (30.8 మి.మీ), నాగోల్ (28.3 మి.మీ), వనస్థలిపురం (24.3 మి.మీ) లలోనూ వాన పడింది. వచ్చే నాలుగైదు రోజుల పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 23 నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరం వద్ద అల్పపీడనం లేదా ఆవర్తనం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం సెప్టెంబర్ 23 నుంచి 25 మధ్య తెలంగాణపై గట్టిగా పడనుందని అంచనా వేస్తున్నారు. ఇది గనుక జరిగితే రాష్ట్రంలో వర్షాల తీవ్రత మరింత పెరిగి, ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అయితే, అల్పపీడన పయనించే దిశ, దాని వేగాన్ని బట్టి వర్షాల తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

