Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!

  • తీవ్ర ఎండలతో అల్లాడుతోన్న తెలంగాణ
  • పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
  • రాబోయే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి
Telangana Heatwave Alert

Telangana Heatwave Alert

Telangana Heatwave Alert for Next 5 Days: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఎండలతో అల్లాడుతోంది. మండుతున్న ఎండలతో రాష్ట్రం మొత్తం హీట్ కోర్ జోన్‌గా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేశారు. రాబోయే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఈరోజు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని సూచించారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రేపటి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాకు కూడా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మధ్యాహ్న సమయంలో రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. రైతులు, కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.