తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ , అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసే క్రమంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుందని, అందుకే వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Youtube Searchలో భారీ మార్పులు.. ఇకపై Short వీడియోలను దాచిపెట్టవచ్చు.!
ఈ భారీ బీమా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో ప్రభుత్వం ఇప్పటికే విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపిందని, ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుందని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా గత ప్రభుత్వం వదిలివెళ్లిన బకాయిలను సైతం ప్రతి నెలా క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రయోజనాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ ప్రమాద బీమా పథకమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం చూపుతున్న వేగం ఉద్యోగ వర్గాల్లో హర్షాన్ని కలిగిస్తోంది.
గతంలోనే సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ , ఎన్పీడీసీఎల్ వంటి కీలక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమాను ప్రభుత్వం విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ చొరవతో ఇప్పటికే సింగరేణిలో పనిచేస్తున్న 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, విద్యుత్ సంస్థల్లోని 71,387 మంది ఉద్యోగులకు రక్షణ కవచం లభించింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు కూడా ఈ 1.02 కోట్ల బీమాను వర్తింపజేయడం ద్వారా దేశంలోనే తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్నామని భట్టి విక్రమార్క గర్వంగా ప్రకటించారు. ఈ బీమా పథకం ప్రమాదవశాత్తు ఏదైనా అనర్థం జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి చెక్.. 75 బస్సులపై కేసులు
