Site icon NTV Telugu

CM Revanth Reddy: నేత కార్మికులకు రూ.50 కోట్లు.. బకాయిల చెల్లింపునకు సీఎం నిర్ణయం

Handloom Weavers

Handloom Weavers

CM Revanth Reddy: నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయి పడింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి.

Read Also: Heat Wave: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలివే!

సిరిసిల్లలో కార్మికులు వరుసగా ఆందోళనలు చేయడంతో పాటు బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలుమార్లు అక్కడి కార్మికులు, ఆసాములతో చర్చలు జరిపారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బకాయిలు విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని బకాయిలను క్లియర్ చేయాలని చెప్పారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫాంల తయారీకి సుమారు రూ. 47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్‌కు రూ. 14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి రూ.50 కోట్లు చెల్లింపునకు సీఎం తీసుకున్న నిర్ణయం నేత పరిశ్రమకు ఊరటనిచ్చినట్లయింది.

Exit mobile version