khammam BRS Candidate Puvvada Ajay Kumar Slams Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 30 రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుపై సెటైర్స్ పేల్చారు. కాంగ్రెస్ పాలనలో వాటర్ ట్యాంకర్‌లు తిరిగితే.. తమ పాలనలో ఇంట్లో మహిళలు టాప్‌లు తిప్పుతున్నారన్నారు. ఖమ్మం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజయ్‌కు తుమ్మల సవాల్ విసిరిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ… ’76 ఏళ్ల పాలనలో ఖమ్మం నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేదు. ఇదికాదు ఒక్క కళాశాల అయినా తెచ్చారా. ఇపుడు పోటీ చేసే అభ్యర్థి ఎందుకు అభివృద్ధి చేయలేదు. నేను ఇక్కడి భూమిపుత్రుడను. ఖమ్మం అభివృద్ధికి సాయపడుతున్నా. మీ పాలనలో వాటర్ ట్యాంకర్‌లు తిరిగాయి.. మా పాలనలో ఇంట్లో మా అక్కలు టాప్‌లు తిప్పుతున్నారు. ఖమ్మంను నలువైపులా అభివృద్ధి చేసాం. కొత్తగా ఏర్పడ్డ రఘునాథపాలెంను 253 కోట్లతో అభివృద్ధి చేశాం. ఖమ్మం రూపురేఖలు పూర్తిగా మార్చాం’ అని అన్నారు.
‘ఖమ్మంలో 2014లో 70 అపార్ట్మెంట్స్ ఉండేవి. ఇపుడు 800 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నీ శిలాఫలకాలకు నేను ఫలితాలు చెప్పించా. ప్రజలకు కావాల్సింది శిలాఫలకాలు కాదు..పూర్తి అయిన పనులు కావాలి. నువు పాలేరుకు ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాష్ట్రానికి మంత్రివి కదా.. అపుడేందుకు బ్రిడ్జిలు కట్టలేదు. తీగల వంతెన కట్టాలని పాలేరు ప్రజలు అడిగితే అవసరమా? అన్నావు. తీగల వంతెన కడితే ఖమ్మం ఎమ్మెల్యేకు క్రెడిట్ వస్తుందని అభివృద్ధి చేయలేదు. మీ పిచ్చి రాజకీయాలకు, సోషల్ మీడియా మాటలకు ప్రజలు మొగ్గరు’ అని పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.