Harish Rao Said Congress Party Copy Ramakka Song: బీఆర్‌ఎస్ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేనిఫెస్టోని మాత్రమే కాదని.. రామక్క పాటని (గులాబీల జండలే) కూడా కాంగ్రెస్ సహా బీజేపీ కూడా కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎంలు అనుకుంటున్నారని, సుతి లేని కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రం పడితే ఆగం అవుతాం అని హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం సిద్ధిపేటలోని మిరుదొడ్డి సభలో హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
‘కాంగ్రెస్ వాళ్లకు సుతి లేదు. కాంగ్రెస్‌లో ఎవరికి వారే సీఎంలు అనుకుంటున్నారు. నేను సీఎం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలు అంటున్నారు. సుతి లేని కాంగ్రెస్ చేతిలో రాష్ట్రం పడితే ఆగం అవుతాం. కాంగ్రెస్ వాళ్లు మన మేనిఫెస్టోని కాపీ కొట్టారు. కేసీఆర్ రైతుకు ఎకరానికి 16 వేలు అంటే.. కాంగ్రెస్ వాళ్లు 15 వేలు అంటున్నారు. ఆఖరికి రామక్క పాటని కూడా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కాపీ కొట్టారు’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
‘ఓట్లు అంటే మూడు రోజుల పండుగ కాదు.. మన ముందున్న ఐదేళ్ల భవిష్యత్తు. తెలంగాణలో బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. మరి దుబ్బాకలో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో వంద హామీలు ఇచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మేము చేసిన పనులకు కొబ్బరికాయ, కత్తెర పట్టుకుని నేను చేసినా అని రఘునందన్ బయలుదేరుతాడు. మేం ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాము. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ ఇచ్చిన ఒక్క హామీ అయిన అమలయ్యిందా?. కేసీఆర్ అంటే నమ్మకం, ఓ విశ్వాసం’ అని హరీశ్ రావు చెప్పారు.