Site icon NTV Telugu

Telangana Election Results: హమ్మయ్యా.. హుజురాబాద్‍లో తప్పిన శవయాత్ర!

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజారాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్‌ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై 17,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంతో ఇక్కడ ‘శవయాత్ర’ తప్పింది. ప్రచారంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే హుజారాబాద్‌ నియోజకవర్గ ప్రజలందరూ తన శవయాత్రకు రావాలని కోరిన విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారం చివరి రోజున పాడి కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను చేయాల్సిన ప్రచారం చేశా.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం. ఓట్లేసి గెలిపిస్తే డిసెంబర్ నాలుగో తారీఖున నేను విజయయాత్ర వస్తా.. లేకపోతే మీరు నా శవయాత్రకు రండి. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఇప్పుడు కౌశిక్‌ రెడ్డి గెలవడంతో శవయాత్ర తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి తన కూతురుతో కూడా ప్రచారం చేయించారు. తన డాడీని గెలిపించాలని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆమె కోరింది. చివరికి తనను గెలిపించకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు హుజురాబాద్ ప్రజలు భయపడిపోయి ఓట్లు వేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌కు స్థానికంగా మంచి పేరు ఉన్నప్పటికీ.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో జనం కారు వైపు మొగ్గాల్సి వచ్చిందట.

Exit mobile version