Ponnam Prabhakar : తెలంగాణ శాసన మండలిలో విద్యా వ్యవస్థపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్ లో పరిస్థితిని పరిశీలించినప్పుడు బాధ కలుగుతోందని, ప్రస్తుత విద్యా విధానంలో మార్పు చేసి మెరుగుదల తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం తీవ్ర సమస్యగా మారింది. మా దగ్గర చిగురు మామిడి మండలం నవాబ్ పేట గ్రామంలో 50 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు” అని పేర్కొన్నారు.
“ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటేనే విద్యార్థులు సంకోచిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కూల్ బస్సుల సౌకర్యం, ల్యాబ్ సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగడం లేదు” అని అన్నారు. “విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పెద్దల సభలో నుంచి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది” అని మంత్రి పేర్కొన్నారు. “కేరళ వంటి రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం అధికంగా ఉండటానికి అక్కడి మంచి విద్యా విధానం కారణం. మన రాష్ట్రంలో కూడా సరైన విధానాన్ని అమలు చేయాలి” అని సూచించారు.
“విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ కొన్ని సూచనలు చేశారు. మండలాలకు ప్రత్యేకంగా స్కూల్ బస్సుల వ్యవస్థను రూపొందించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు” అని మంత్రి తెలిపారు. “ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలూ కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న పిల్లల చదువుకు రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలకు అతీతంగా సమగ్ర విద్యా విధానం రూపొందించాలి” అని ఆయన స్పష్టం చేశారు.
“రాబోయే కాలంలో అందరి ఆమోదయోగ్యమైన ఒక సమగ్ర విద్యా విధానాన్ని తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. “ఉపాధ్యాయ నియామకాలు పెరుగుతున్నా, జీతాలు పెరుగుతున్నా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం” అని అన్నారు.
“గతంలో కరీంనగర్‌లో నాలుగు హైస్కూల్స్ ఉండేవి. ఇప్పుడు స్కూళ్ల సంఖ్య పెరిగింది, ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది, కానీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. ముఖ్యమంత్రి ఇటీవల రవీంద్ర భారతిలో చేసిన వ్యాఖ్యల ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల మధ్య తేడాను పరిశీలించాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. “ప్రైమరీ విద్యనే విద్యార్థులకు బేస్. విద్యా వ్యవస్థ బలోపేతం అయితేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు.
“ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ కోసం మండలాలకు స్కూల్ బస్సుల సౌకర్యాన్ని అందించే ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సంఖ్య పెరగాలంటే సరైన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులను తప్పు పట్టడం లేదు, కానీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది” అని ఆయన సూచించారు.