Site icon NTV Telugu

Meenakshi Natarajan: సాదాసీదాగా రైల్లో హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్!

Meenakshi Nararajan

Meenakshi Nararajan

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా రైల్లో ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గాంధీభవన్‌కు చేరుకున్నారు.

గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంకు మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీసు బేరర్లు సమావేశంలో పాల్గొననున్నారు. ఇన్‌చార్జి హోదాలో మీనాక్షి నటరాజన్ మొదటిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాంతో ఆమె ఏ విధంగా మాట్లాడనున్నారనే ఆసక్తి పార్టీ నేతల్లో నెలకొంది.

ఈ సమావేశం మీనాక్షి నటరాజన్‌తో రాష్ట్ర నేతల పరిచయ కార్యక్రమం మాత్రమేనని, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. బీసీలకు తగిన న్యాయం చేయాలని పార్టీలోని బీసీ నేతలు మీనాక్షి నటరాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. మీటింగ్ అయిపోయిన వెంటనే ఏఐసీసీ కార్యదర్శి తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Exit mobile version