NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ!

Revanth Reddy, Pm Modi

Revanth Reddy, Pm Modi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10.30కు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం భేటీ కానున్నారు. బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. అలానే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంను పూర్తిస్థాయిలో ప్రధానికి వివరించనున్నారు. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మోడీతో సీఎం రేవంత్ ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ సమాచారం రావడంతో.. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్‌.. దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం అవుతున్నారు. నేటి భేటీలో మూసీ సుందరీకరణ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడం లాంటి విషయాలు చర్చించనున్నారు. అలానే విభజన చట్టంలోని వివిధ పెండింగ్‌ సమస్యలను ప్రధానికి సీఎం విన్నవించనున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. అలానే కాంగ్రెస్‌ అగ్ర నేతలను కలసి.. ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నాయి. మంగళవారం రాత్రి సీఎం ఢిల్లీ అధికార నివాసంలో రాష్ట్ర అధికారులతో చర్చించారు. సీఎస్, డీజీపీలు ఢిల్లీకి చేరుకున్నారు.