Site icon NTV Telugu

IND vs ENG: ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ సీఎం.. హాజరుకానున్న భారత క్రికెట్ దిగ్గజాలు!

Revanthreddy Cm

Revanthreddy Cm

HCA President Jagan Mohan Rao on IND vs ENG 1st Test: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. కీలక సమరానికి సిద్ధమవుతోంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జనవరి 25 నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అంతేకాదు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రావు మాట్లాడుతూ… ‘భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం. అంతర్జాతీయ మ్యాచ్ చూడాలనుకునే సామాన్య ప్రజల కోసం టికెట్ ధరలు తగ్గించాం. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తాం. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు ఉచిత ప్రవేశం ఉంటుంది’ అని తెలిపారు. ఈ మ్యాచ్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు చెప్పారు. సీఎం లండన్‌ నుంచి రాగానే నేరుగా కలిసి మ్యాచ్‌కు హాజరవ్వాలని కోరుతామన్నారు.

Also Read: WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్‌కు ఇంగ్లండ్ సిరీస్‌ కీలకం!

హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం జనవరి 23న జరుగుతుందని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ సహా మరికొందరు హాజరవుతారని చెప్పారు. హెచ్‌సీఏ తరఫున వారిని కలిసి తొలి టెస్ట్‌కు హాజరుకావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని జగన్‌ మోహన్ రావు చెప్పారు. ఈ టెస్ట్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు త్వరలో హైదరాబాద్‌కు రానున్నాయి.

Exit mobile version