CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆయన స్పష్టతనిచ్చారు. తెలంగాణలో ఉపఎన్నికలు రావని ఖరాఖండిగా ప్రకటించిన సీఎం, అసెంబ్లీ సభ్యులు ఎవరూ ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలపై ఊహాగానాలు చేస్తున్నవారికి సమాధానం ఇస్తూ, ఇలాంటి అంశాలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టడం మేలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చినా, మళ్లీ వెనక్కి వెళ్లినా, వాటితో సంబంధం లేకుండా ఉపఎన్నికలు జరిగే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి తన ప్రాధాన్యత అని స్పష్టం చేసిన సీఎం, ఉపఎన్నికల గురించి చర్చించేందుకు తన సమయం వృథా చేసుకోవడం లేదు అని చెప్పారు. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున, తీర్పు వచ్చిన తర్వాత తాము దానిని స్వీకరిస్తామని చెప్పారు. ఇక, బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, ఆ వ్యవహారం హైకోర్ట్, సుప్రీంకోర్టుకు వెళ్లడం, త్వరలో కోర్టు తీర్పు రాబోతుందన్న వార్తలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
వీరు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బీఆర్ఎస్ నేతలు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి పట్ల ఆయన చేసిన ప్రకటనతో ఉపఎన్నికలపై వదంతులకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.