Telangana BJP: కర్ణాటక ఫలితాల తర్వాత ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అధికారం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. కర్ణాటక ప్రభావం.. తెలంగాణలో కచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రధాన రాజకీయ పార్టీల్లో బలంగా ఉంది. అందుకే అక్కడ గెలిచిన వారికి ఇక్కడ మోరల్ బూస్ట్ దొరుకుతుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఐదునెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. స్టేట్ ఇప్పటికే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన కర్ణాటక ఫలితం టి కాంగ్రెస్‌కు ఊహించని ఉత్సాహాన్ని ఇచ్చింది. కర్ణాటకలో అంతపెద్ద బీజేపీనే కొట్టగలిగాం. ఇక ఇక్కడ గెలుపు పెద్ద మేటర్ కాదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారంటే.. ఆ ఒక్క విజయం ఎంత నైతిక బలాన్ని ఇచ్చిందో ఊహించుకోవచ్చు.
కర్ణాటకలో గెలిస్తే చాలు… అది మోరల్‌గా తమకు ఎంతో ఉపయోగపడుతుందని మొదట్నుంచి చెబుతున్నారు టి కాంగ్రెస్ లీడర్స్. ఇప్పుడు కేవలం గెలుపు కాదు. బంపర్ విక్టరీ కాంగ్రెస్ సొంతమైంది. అందుకే టి కాంగ్రెస్ నేతల్లో ధీమా పెరుగుతోంది. ఇక దక్షిణాదిన ఎదగాలనుకుంటున్న బీజేపీకి కాలం కలసి రావడం లేదు. 2018లో అతి కష్టం మీద అధికారం దక్కించుకుంది. అప్పట్లో కూడా బీజేపీ స్వతహాగా విజయం సాధించలేదు. ఆపరేషన్ లోటస్ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఇప్పుడు ఆ పార్టీకి మైనస్ అయింది. అప్పట్లో ఓట్లేసి తమకు కావాల్సిన అభ్యర్థిని గెలిపించుకున్న ఓటర్లంటే లెక్క లేనట్టు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది బీజేపీ. కానీ… ఐదేళ్లు తిరిగి వచ్చేసరికి అదే ఓటర్లు ఇప్పుడు కమలం పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఊహించని విజయాన్ని కట్టబెట్టారు. దక్షిణాదిలో విస్తరించాలనుకున్న బీజేపీ ఆశలకు గండి పడింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీని విస్తరించాలనుకున్న రాష్ట్రం తెలంగాణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతూ వస్తోంది. కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వస్తే… తెలంగాణను కొట్టడం తేలికవుతుందని లెక్కలు వేసుకున్నారు కాషాయ నేతలు. కానీ… ఇప్పుడా లెక్కలు తప్పాయి. కాంగ్రెస్ ఊహించని విజయం సొంతం చేసుకోవడం తెలంగాణ బీజేపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది.
కర్ణాటకలో బీజేపీ గెలిస్తే తెలంగాణలో కూడా కాంగ్రెస్ బలహీనపడుతుందని కాషాయ నేతలు భావించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో సొంత పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతుందని.. అదే సమయంలో తాము విజృంభించవచ్చని అనుకున్నారు. అదే సమయంలో బీజేపీలోకి చేరికలు ఉంటాయని అంచనాలు వేసుకుంది పార్టీ. ప్రజల్లో తమకు సానుకూల వాతావరణం ఏర్పడు తుందని, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ప్రణా ళికల్లో కాషాయ నేతలు ఉన్నారు. కానీ.. చివరికి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆ పొజిషన్‌లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కర్ణాటకను గెలిస్తే తెలంగాణను గెలిచినట్టేనని బీజేపీ కార్యకర్తలకు నూరిపోశారు ఆ పార్టీ నాయకులు. కర్ణాటకలో కమలానికి కాస్తో, కూస్తో పట్టుంది. కానీ.. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఇలాంటి స్థితిలో కర్ణాటకలో గెలుపు ప్రభావం కచ్చితంగా తెలంగాణపై పడుతుందని ఆ పార్టీ అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలు, లెక్కలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఎన్ని ఉన్నా…ఎన్నికల టైం వచ్చేసరికి వాటన్నిటినీ పక్కకు పెట్టి చావో, రోవో అన్నట్టు పోరాడారు ఆ పార్టీ సీనియర్ నేతలు, సిద్ద రామయ్య, డీకే శివకుమార్ లాంటి నాయకులు ఇప్పుడు గెలవకుంటే ఇక రాజకీయ భవిష్యత్‌లేదన్నంతగా పని చేశారు. దాని ఫలితం ఇప్పుడు కళ్ళకు కనిపిస్తోంది. ఇప్పుడు అవే వ్యూహాలను తెలంగాణలో కూడా అమలు చేయాలనుకుంటోంది కాంగ్రెస్. టి కాంగ్రెస్ నేతలు కూడా వర్గాలు, విభేదాలు విడనాడి కలిసి పని చేయాలంటూ…కర్ణాటక ఫలితాన్ని చూపిస్తోంది కాంగ్రెస్ హై కమాండ్.
ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాల్ని మరో రాష్ట్రంతో లింక్ పెట్టే అలవాటు బీజేపీకి ఎప్పట్నుంచో ఉంది. ఉత్తరాదిన గుజరాత్ ఫలితాల్ని రాజస్థాన్‌లో వాడుకోవడం, యూపీ విజయాన్ని బీహార్‌లో క్యాష్ చేసుకోవడం… ఇలా రకరకాల పొలిటికల్ గిమ్మిక్స్‌లో ఆ పార్టీ ఆరితేరింది. కానీ దక్షిణాదిలో సేమ్ ఫార్ములా వాడే అవకాశం ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు కర్ణాటకను, తెలంగాణను ముడిపెట్టి ప్లే చేద్దామనుకున్నా మొదటికే మోసం వచ్చింది. కర్ణాటక గెలిస్తే..తెలంగాణ ఎన్నికలకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనుకున్నారు బీజేపీ నేతలు. కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని అనుకున్నారు. జాతీయ నాయకత్వం కూడా గెలుపు ఊపులో గట్టి వ్యూహాలు రచిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కర్ణాటక ఎన్నికలు ఎంత కీలకమో తెలిసే.. ప్రధాని మోడీ అంత ఉధృతంగా ప్రచారం చేశారు. చివరికి మొత్తం తల్లకిందులైంది. ఆ పార్టీ అంచనాలన్నీ తప్పాయి. ఇప్పుడు ఆ స్థాయి ఊపు, ఉత్సాహం కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. పొరుగు రాష్ట్రమే కాబట్టి రేపు తెలంగాణ ఎన్నికల్లో అవసరమైతే టి కాంగ్రెస్‌కు ఆర్థిక సాయం కూడా కర్ణాటక నుంచి లభించవచ్చు. ఇలా ఎట్నుంచి ఎటు చూసినా… కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో రెండు ప్రధాన పార్టీల ముఖ చిత్రాలను మార్చేశాయి.
