Site icon NTV Telugu

BC Reservations: తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ.. తీర్పుపై తీవ్ర ఉత్కంఠ!

Supreme Court

Supreme Court

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్న వారు సుప్రీంకోర్టు తీర్పుపై ఆశగా ఎదురుచూస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తి వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే జరిగిందని పిటీషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లపై రాజ్యాంగంలో 50 శాతం పరిమితి లేదని, ఇది సుప్రీంకోర్టు కేవలం విధించిన మార్గదర్శక సూత్రం మాత్రమే అని పేర్కొంది.

‘బీసీ రిజర్వేషన్లపై శాస్త్రీయంగా కుల సర్వే జరిగింది. బీసీల జనాభా తెలంగాణలో 56 శాతానికి పైగా ఉంది. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపరీకల్ డాటా సేకరించాం. శాస్త్రీయ అధ్యయనం తర్వాతే చట్ట నిబంధనలకు లోబడి 42% రిజర్వేషన్లు కల్పించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది’ అని పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్‌ తాజాగా న్యాయస్థానం రిజిస్ట్రీలో లిస్ట్‌ కావడంతో గురువారం విచారణకు రానున్నది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనుంది.

 

Exit mobile version