Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..

Tg Assembly

Tg Assembly

Telangana Assembly: తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి అధికారిక సర్కులర్ జారీ చేశారు. సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటల నుంచి సభలు ప్రారంభమవుతాయని పేర్కొంటూ అసెంబ్లీ అధికారులు శాసనసభ సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని అందిస్తూ సర్కులర్‌ను పంపించారు. తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్‌లోనే నిర్వహిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సభలో విస్తృతంగా చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చి ఈ చర్చలో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలను లోతుగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు, రగులుతున్న సామాజిక అంశాల నేపథ్యంలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా మారనున్నాయి.