Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!

Acb

Acb

Hyderabad-Telangana ACB: “లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం”.. ఈ సూక్తి ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు కనిపిస్తుంది. ఇప్పటివరకు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితేనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేస్తారనే భావన ఉండేది. కానీ, అధికారులు అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినా నేరమేనని, జైలు శిక్ష తప్పదని తెలంగాణ ఏసీబీ సరికొత్త సంప్రదాయానికి నాంది పలికింది. కేవలం లంచం డిమాండ్ చేసినందుకు గాను బంజారాహిల్స్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) విజయ్‌ను అరెస్ట్ చేసి అవినీతి చరిత్రలో కీలక మలుపు తిప్పారు.

అసలేం జరిగింది?

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక చీటింగ్ కేసులో ఓ వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.10 లక్షల లంచం ఇవ్వాలని ఎస్సై విజయ్ డిమాండ్ చేశారు. అయితే సదరు వ్యక్తి అంత మొత్తం ఇవ్వలేకపోవడంతో, ఆగ్రహించిన ఎస్సై అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిబంధనల ప్రకారం అరెస్ట్ లేదని భావించిన కోర్టు, నిందితుడి రిమాండ్‌ను తిరస్కరించి అతనికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే, సదరు వ్యక్తిపై గతంలోనూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. ఆ పాత కేసుల పేరుతో అతన్ని మళ్లీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై విజయ్, మరోసారి నోటీసులు జారీ చేశారు. పాత కేసుల్లో అరెస్ట్ కాకుండా ఉండాలంటే మళ్లీ లంచం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో బాధితుడు అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని, సర్దుబాటు చేసి రూ.2 లక్షలు ఇస్తానని ఎస్సైతో ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు.

అనుమానంతో సెలవు.. కానీ తప్పని ఉచ్చు!

బాధితుడు డబ్బులు తెస్తానని చెప్పి వెళ్లిన తర్వాత ఎస్సై విజయ్‌కు ఏదో అనుమానం వచ్చింది. విషయం బయటకు పొక్కుతుందేమోనన్న భయంతో ఆయన హడావుడిగా సెలవు పెట్టి విధులకు దూరంగా వెళ్లిపోయారు. మరోవైపు ఎస్సై వేధింపులు భరించలేని బాధితుడు నేరుగా ఏసీబీ ఉన్నతాధికారులను ఆశ్రయించి, ఎస్సై విజయ్ తనను డబ్బులు డిమాండ్ చేసిన ఆధారాలను అందించాడు.
ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ అధికారులు, డబ్బులు చేతికి అందకపోయినా ‘లంచం డిమాండ్ చేయడం’ (Demand of illegal gratification) కూడా అవినీతి నిరోధక చట్టం కింద తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. బాధితుడి వద్ద ఉన్న ఆధారాలను ప్రాథమికంగా నిర్ధారించుకున్న అనంతరం ఎస్సై విజయ్‌పై కేసు నమోదు చేసి, ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు.

ఉన్నతాధికారుల పాత్రపై ఆరా!

ఒక సాధారణ ఎస్సై స్థాయి అధికారి ఏకంగా రూ.10 లక్షల భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడం వెనుక స్టేషన్‌లోని ఉన్నతాధికారుల అండదండలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎస్సై వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై ఆధారాలు లభిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లంచం అడిగితే చాలు కటకటాలు లెక్కపెట్టాల్సి వస్తుందన్న ఏసీబీ సందేశం ప్రజల్లోనూ సరికొత్త విశ్వాసాన్ని నింపింది.